
పెబ్బేరు, వెలుగు: ఆర్థిక, అనారోగ్య కారణాల తో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన రేవంత్‌కుమార్(27) ఈనెల14న బొలెరో వెహికల్లో మిర్చి లోడ్‌తో నిజామాబాద్ వెళ్లాడు. మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల సమయంలో తన తమ్ముడు కిరణ్ కుమార్‌కు వీడియోకాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. అతడు చేసిన అప్పుల లెక్కల వివరాలు నోట్‌బుక్‌లో రాసి ఇంట్లో పెట్టానని, ఉన్న భూమిని అమ్మి తీర్చాలని సూచించాడు.
అమ్మ జాగ్రత్త అంటూ.. తమ్ముడితో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే పురుగుల మందు తాగాడు. రేవంత్ పెబ్బేరు వద్ద ఉన్నట్లు లోకేషన్ లో చూపించడంతో పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొత్తకోట బైపాస్ వద్ద ఆగిన బొలెరో వద్దకు వెళ్లి చూడగా అప్పటికే అతడు చనిపోయినట్లు గుర్తించారు. బుధవారం తమ్ముడు కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.