ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిని చంపిన అన్నలు

ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిని చంపిన అన్నలు

తమకు ఇష్టం లేకుండా ఓ దళితున్ని ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిని చంపారు ఆమె అన్నలు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో జరిగింది. కిస్నిలోని కశ్యప్‌నగర్‌కు చెందిన చాందిని కశ్యప్ (23), అర్జున్ కుమార్ (25) అనే దళిత యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ జూన్ 12న యూపీలోని ప్రతాప్‌గర్‌‌లో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి చాందిని కుటుంబసభ్యులకు ఇష్టంలేదు. దాంతో చాందిని తన భర్తతో కలిసి ఈస్ట్ ఢిల్లీలోని త్రిలోక్‌పురిలో నివాసముంటుంది. అర్జున్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

చాందిని సోదరులు సునీల్ (32), సుశీల్ (28), సుధీర్ (26)లు నవంబర్ 17న ఢిల్లీలో ఉంటున్న చాందినిని కలుసుకున్నారు. చాందినిని తమ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండాల్సిందిగా కోరారు. దాంతో చాందిని తన అన్నలతో కలిసి కశ్యప్‌నగర్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత చాందిని అన్నలు.. దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా అని ఆమెతో గొడవపడ్డారు. మాటామాటా పెరిగి చాందినిని నవంబర్ 20న తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పొలంలో ఖననం చేశారు.

చాందిని కశ్యప్‌నగర్ వెళ్లిన తర్వాత అర్జున్‌తో కాంటాక్ట్‌లో లేకుండా పోయింది. దాంతో అర్జున్ నవంబర్ 22న మయూర్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐపీసీ సెక్షన్ 365 (కిడ్నాప్) కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. చాందిని కోసం ఒక బృందాన్ని మెయిన్‌పురికి పంపారు. అక్కడ పోలీసులు చేసిన దర్యాప్తులో ఆమె చంపబడినట్లు బయటపడింది.

 

కిస్నీకి చెందిన సీనియర్ సబ్-ఇన్స్పెక్టర్ జాకబ్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. ‘చాందిని జూన్లో తన కుటుంబానికి విరుద్ధంగా వివాహం చేసుకుంది. చాందిని కుటుంబం ఓబిసి వర్గానికి చెందినవారు కావడంతో.. దళితుడితో పెళ్లికి నిరాకరించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపిచాం’ అని తెలిపారు.

మయూర్ విహార్ డీసీపీ సింగ్ మాట్లాడుతూ.. ‘మెయిన్‌పురిలో చాందినీ కుటుంబసభ్యులను చాందిని గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్పారు. గ్రామస్తులను అడిగితే.. చాందినిని ఆమె అన్నలు ఇంటికి తీసుకువచ్చారని, కానీ కొన్ని రోజులుగా తామెవరూ ఆమెను చూడలేదని చెప్పారు. దాంతో చాందిని అన్నలను విచారించగా.. ఆమెను చంపినట్లు ఒప్పుకున్నారు. ఆమె సోదరులలో ఒకరిని అరెస్టు చేశాం. మిగతా ఇద్దరు నిందితులను పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది’ అని ఆయన తెలిపారు.

తన భార్య మృతిని తలచుకొని అర్జున్ కన్నీటీపర్యంతం అయ్యాడు. తాము ఎనిమిది సంవత్సరాల క్రితం కలుసుకున్నామని అర్జున్ తెలిపాడు. ‘మేం జూన్ 12న యూపీలోని ప్రతాప్‌గర్‌‌లో వివాహం చేసుకున్నాం. నేను తక్కువ కులానికి చెందినవాడిని కాబట్టి, ఆమె కుటుంబం మా వివాహాన్ని అంగీకరించలేదు. ఆమె సోదరులు నవంబర్ 17న ఆమెను మెయిన్‌పురికి తీసుకెళ్లారు. ఆమె ఢిల్లీ నుంచి వెళ్లిన తరువాత, నేను ఆమెతో మాట్లాడలేకపోయాను. దాంతో ఆమె బంధువులకు ఫోన్ చేశాను. వారంతా అబద్దం చెప్పారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక కజిన్ చెప్పారు. ఆమె వేరొకరిని వివాహం చేసుకుందని మరో బంధువు చెప్పారు. ఇంకొకరైతే ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయిందని చెప్పారు’ అని అర్జున్ తెలిపాడు.

For More News..

డోర్-టు-డోర్ ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్త హత్య

క్షీణిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

కలిసున్నప్పుడు ఓకే.. విడిపోయాక రేప్ అంటున్నారు