ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  నా భూమి ఆక్రమించిండు

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  నా భూమి ఆక్రమించిండు
  •     సొంత పార్టీ మహిళా కార్యకర్త  జున్ను సంతోష ఆరోపణ
  •     ఆ జాగలో అడుగుపెడితే చంపేస్తానని బెదిరిస్తున్నడని ఆవేదన

బషీర్​బాగ్, వెలుగు : పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన 25  ఎకరాల భూమి ఆక్రమించుకున్నారని సొంత పార్టీ మహిళా కార్యకర్త జున్ను సంతోష ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన మనుషుల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం గుడేస్పాడు గ్రామ చెరువు శిఖంలోని సర్వే నెంబర్ 731లో తనకు 25 ఎకరాల( లావణి పట్టా వ్యవసాయ భూమి) భూమి ఉందని సంతోష మంగళవారం మీడియాతో చెప్పారు. ఆ భూమి తన ఉమ్మడి కుటుంబానికి చెందిందని అన్నారు. చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆ మొత్తం జాగను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా తమపై దాడులకు పాల్పడుతున్నారని, భూమిలో అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని సంతోష ఆరోపించారు.

మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట వేస్తే.. మొత్తం దోచుకుపోయారని, ప్రశ్నించిన తనను కొట్టారని ఆమె ఆరోపించారు. ఇదే విషయంపై ఏప్రిల్ 28వ తేదీన ఆత్మకూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసులు ఎమ్మెల్యేకు మద్దతుగా కాగితాలపై సంతకాలు చేయించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఆత్మకూరు ఎస్ఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని సంతోష డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకుని, కబ్జాకు గురైన తమ భూమిని తిరిగి ఇప్పించాలని సంతోష విజ్ఞప్తి చేశారు.