- మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం యాదగిరిగుట్టలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు పాపట్ల నరహరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుంతలమయమైన ఎస్సీ కాలనీ రోడ్డు కారణంగానే.. ఎస్సీ కాలనీ వాసులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి చెరువులోకి వరద నీరు వెళ్లేలా ఎస్సీ కాలనీ రోడ్డు పక్క నుంచి ఏర్పాటు చేస్తున్న కాల్వ పనులు అసంపూర్తిగా మధ్యలోనే నిలిచిపోవడం వల్ల.. ఆ కాల్వలో పడి ఇప్పటికే చాలామంది స్థానిక ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి ఉదయం 5 గంటలకు స్కూటీపై డ్యూటీకి వెళ్తూ అసంపూర్ణంగా ఉన్న కాల్వలో పడడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. రాస్తారోకో కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో.. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాహుపేట సర్పంచ్ కవిడే మహేందర్, మండల నాయకుడు కోల వెంకటేష్ గౌడ్, పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
