
- బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో బీసీలకు ద్రోహం చేసే కుట్ర కనిపిస్తున్నదని బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ లోపల, బయటా బీఆర్‌ఎస్ తరఫున దీనిపై పోరాడుతామని చెప్పారు. గవర్నర్ ద్వారా కేంద్రానికి బిల్లు పంపినా దాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్నారని, దీనిపై తమకు అనుమానాలున్నాయని అన్నారు.
బీసీ బిల్లులపై కేంద్రం మీద సర్కారు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి అన్నారు. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో న్యాయపరమైన లొసుగులు కనిపిస్తున్నాయన్నారు. బీసీల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
కులగణన తప్పుగా చేసి బీసీ జనాభాను తక్కువగా చూపించారని విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ నివే దికపై కేబినెట్‌లో కనీసం చర్చించలేదని విమర్శించారు. బీసీ బిల్లులు ఢిల్లీలో పెండింగ్‌లో ఉండగానే ఆర్డినెన్సును తీసుకురావడం రాజ్యాంగపరంగా సం క్షోభాన్ని తీసుకురావడమేనన్నారు. బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నదా అని ప్రశ్నించారు.
ఆర్డినెన్సులను కోర్టులు కొట్టేస్తాయని తెలిసే సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్సును తెచ్చారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. చట్టబద్ధత లేకుండా ఆర్డినెన్సులు ఇవ్వడం సరైంది కాదన్నారు. తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లపై షెడ్యూల్ 9లో చేర్చేలా పోరాడాలని అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కేం ద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లులను ఆమోదింప జేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌లో రిజర్వేషన్లపై జీవోలు ఇస్తే కోర్టుల్లో నిలవలేదన్నారు. డెడికేటెడ్ కమిషన్‌ను చట్టప్రకారం వేయలేదని, కేవలం 9 రోజుల్లోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎలా ఇస్తుందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం ప్రశ్నించారు.