రాజయ్యను బీఆర్‍ఎస్‍ ఎందుకు పక్కన పెట్టిందో చెప్పాలి ..కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, రేవూరి

రాజయ్యను బీఆర్‍ఎస్‍ ఎందుకు పక్కన పెట్టిందో చెప్పాలి ..కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, రేవూరి
  • కుటుంబ పాలనను తరిమికొట్టినా పొగరు దిగట్లేదు!  
  • ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురించి మాట్లాడే హక్కులేదు

వరంగల్‍, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‍ ఘన్‍పూర్‍ సిట్టింగ్‍ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా ఎందుకు పక్కనపెట్టారో బీఆర్‍ఎస్‍ నేతలు చెప్పాలని కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హనుమకొండలోని కాంగ్రెస్‍ భవన్‍లో నిర్వహించిన ప్రెస్‍మీట్‍ లో వారు మాట్లాడారు. అప్పట్లో రాజయ్యకు టిక్కెట్‍ ఇవ్వకపోతే మాట్లాడని నేతలు, కడియం శ్రీహరిపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. 

కడియం గురించి మాట్లాడే హక్కు బీఆర్‍ఎస్‍ నేతలకు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతిపక్షం లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి, అధికారం కోల్పోయాక సత్యహరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి కుటుంబ పాలనను ప్రజలు తరిమికొట్టినా.. ఆ పార్టీ నేతలకు పొగరు  దిగట్లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని దోచుకుతున్న బీఆర్‍ఎస్‍ నేతల ఇండ్లపై ఐటీ రైడ్స్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఓట్ల కోసం వచ్చే గ్రామాలకు బీఆర్‍ఎస్‍ నేతలను జనాలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్‍ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్‍ అజీజ్‍ఖాన్‍ తదితరులు పాల్గొన్నారు.