
- రోడ్డు ప్రమాదాల్లో వన్యప్రాణులు చనిపోతుండడంతో నిర్ణయం
- అటవీశాఖ వినతి మేరకు ముందుకొచ్చిన ఎన్‌హెచ్‌ఐఏ
- తొలుత ఎన్ హెచ్–43కి ఇరువైపులా ఫెన్సింగ్
- దశలవారీగా మిగితా ప్రాంతాల్లోనూ!
హైదరాబాద్, వెలుగు: అటవీ భూములకు సమీపంలో ఉన్న జాతీయ రహదారుల వెంట ఫెన్సింగ్ (కంచెలు) ఏర్పాటు చేయనున్నారు. అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్న జాతీయ రహదారుల్లో చిరుత పులులతోపాటు జింకలు, కోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు ఇలా పలు జంతువులు మేత, మంచినీరు, ఇతర అవసరాల కోసం తరచూ రోడ్డు దాటుతుంటాయి. ఈ క్రమంలో.. వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని కొన్ని వన్యప్రాణాలుచనిపోతుండగా, మరికొన్ని గాయాలపాలవుతున్నాయి.
ఇటీవల జాతీయ రహదారులపై రాత్రివేళ రెండు చిరుత పులులు చనిపోయిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో అడవి మధ్యలో నుంచి వెళ్లే, సమీప నేషనల్ హైవేలకు ఇరువైపులా వన్యప్రాణుల రక్షణ కోసం కంచెలు ఏర్పాటు చేయాలని కోరుతూ అటవీశాఖ అధికారులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు లేఖ రాశారు. దీనికి ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు సానుకూలంగా స్పందించి.. ఫెన్సింగ్ నిర్మాణానికి అంగీకరించారు.
ఈ ఫెన్సింగ్పనులకు టెండర్లు కూడా పిలిచారు. త్వరలో ఈ పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఐఏ ఏర్పాట్లు చేస్తున్నది. కాగా.. తొలుత మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల గుండా వెళ్లే ఎన్‌హెచ్-43 హైవేకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ హైవేలో 5 నుంచి 10 కిలో మీటర్ల మేర అటవీ భూమి ఉన్నట్లుగా గుర్తించారు. ఎన్ హెచ్43 హైవేలో పైలట్ ప్రాజెక్టుగా కంచె పనులు ప్రారంభించనున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే.. రాష్ట్రంలోని అటవీ గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అవసరమైనచోట అండర్ పాస్‌లు నిర్మాణానికి ఫారెస్ట్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.
రహదారికి ఇరువైపులా..!
అటవీ ప్రాంతాల్లో జంతువుల కదలికలు పెరగడం.. మేత, తాగునీరు, ఇతర అవసరాల కోసం తరచూ రహదారులపైకి వస్తుండటంతో ప్రమాదాల బారినపడుతున్నాయని అటవీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న హైవే రోడ్లకు రెండు వైపులా కంచె వేయనున్నారు. 8 ఫీట్ల ఎత్తులో చైన్ లింక్ ఫిన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా జంతువులు అడవి నుంచి బయటకు రావాలన్నా.. సాధ్యం కాదు. ఫిన్సింగ్ఎనిమిది ఫీట్ల ఎత్తు ఉండటంతో దూకడం కూడా సాధ్యం కాదు.
దీంతో జంతువులు దాన్ని దాటుకుని రాలేక.. వెనుతిరిగి అడవిలోకి వెళ్తాయి. ఇక జంతువులు రోడ్డుపైకి వచ్చే చాన్స్ఉండదని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. రోడ్డుపై వన్యప్రాణుల సంచారం కూడా తగ్గుతుంది. కాబట్టి వాహనదారులు ఎలాంటి భయం లేకుండా ఈ రహదారిలో ప్రయాణం చేయవచ్చు.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో..!
రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లతోపాటు ఇతర అటవీ ప్రాంతాల నుంచి పలు జాతీయ రోడ్లు, రాష్ట్ర రోడ్లను నిర్మించారు. శ్రీశైలం నుంచి మన్ననూర్ వరకు జాతీయ రహదారి అమ్రాబాద్ పులుల అభయారణ్యం మధ్య నుంచి వెళ్తున్నది. మెదక్ నుంచి నర్సాపూర్ రోడ్డు, రామాయంపేట నుంచి కామారెడ్డి, నిజామాబాద్ నుంచి నిర్మల్, నిర్మల్ నుంచి ఆదిలాబాద్, ఉట్నూరు నుంచి లక్సెట్టిపేట, ఉట్నూరు నుంచి ఖానాపూర్ వయా నిర్మల్, నాగార్జునసాగర్ రోడ్లు అటవీ మార్గాల నుంచి వెళ్తున్నాయి. రోడ్లతోపాటు పలు అడవుల మీదుగా రైల్వే లైన్లు కూడా ఉన్నాయి. వన్యప్రాణులు రైల్వే లైన్లను, రోడ్లను దాటుతున్నప్పుడు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఈ నేపథ్యంలో అటవీ గుండా వెళ్లే రోడ్డు, రైలు మార్గాల్లో వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. 20 మీటర్ల వెడల్పు, 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిద్వారా జంతువులకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. దీంతో ఈజీగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతి హైవేలో అవసరమైనచోట అండర్ పాస్‌లను ఎన్‌హెచ్‌ఐఏ నిర్మించనున్నది.
కాగా, కొత్తగా నిర్మించే హైవేలలో ఫెన్సింగ్‌తోపాటు అండర్ పాస్ లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఆసిఫాబాద్ మండలం రెబ్బెన దగ్గర ఒకటి, వాంకిడి మండలం శివారు తెలంగాణ– మహారాష్ట్ర బార్డర్లో మరో అండర్ పాస్ నిర్మించారు. దీంతో ఇక్కడ అడవి జంతువుల ప్రమాదాలు చాలావరకు తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, జంతువులు సురక్షితంగా ఒక వైపు నుంచి మరో వైపుకు వెళ్లేందుకు దోహదం చేస్తాయి.
లేఖకు ఎన్‌హెచ్‌ఐఏ స్పందించింది: శంకరన్
అటవీ జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని సీనియర్ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ శంకరన్తెలిపారు. అటవీ మార్గంలో ఉన్న నేషనల్ హైవేలో జంతువులు ప్రమాదాల బారిన పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఐఏకు లేఖ రాయడంతో వారు ముందుకొచ్చారని ‘వెలుగు’తో ఆయన చెప్పారు. చెకొత్త హైవేలలో జంతవులు సంచరించే ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు వేగనియంత్రణ పాటించాలని తెలిపారు.