
ములుగు, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా లో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్‌నగర్‌కు చెందిన గుగులోతు శ్రీను(35), దివ్య దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. బుధవారం శ్రీను తన పాత ఇంటి నుంచి డిగ్రీ కాలేజీ సమీపంలో నిర్మించిన కొత్తింటికి సామగ్రి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో తన కూతురిని బైక్‌పై ఎక్కించుకొని పాత ఇంటికి వెళ్తున్నారు. ములుగు నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంతను తప్పించబోయి బైక్ ను ఢీకొట్టింది. శ్రీను ఎగిరి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయాలై స్పాట్ లోనే చనిపోయాడు. అతని కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లాలో మహిళ..
బెల్లంపల్లి : స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతిచెందగా, మరొకరు గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. తాండూరు మండలం గోపాలరావుపేటకు చెందిన మారుతి, మహిళ పోగుల నాగక్క(40) యూరియా తెచ్చుకునేందుకు బుధవారం రేచిని గ్రామానికి బైక్ పై వెళ్తున్నారు. కిష్టాపూర్ నుంచి ఐబీ వైపు వెళ్లే సెయింట్ థెరిసా స్కూల్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నాగక్కకు తీవ్రగాయాలు కాగా.. మారుతికి కాలు విరిగింది. ప్రమాద స్థలానికి తాండూర్ ఎస్ఐ కిరణ్‌కుమార్ వెళ్లి గాయపడినవారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగక్కను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి భర్త మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.