సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి..హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్

సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి..హైకోర్టులో టీజీపీఎస్సీ అప్పీల్
  • సింగిల్​ జడ్జి ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నయ్​ 
  • మేం సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదు
  • తుది తీర్పు వచ్చేలోగా సింగిల్​ జడ్జి తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌ –1 పరీక్ష పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, సాధ్యంకాకపోతే మళ్లీ మెయిన్స్​పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్‌‌ జడ్జి వెలువరించిన తీర్పును హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ (టీజీపీఎస్సీ) సవాల్‌‌ చేసింది. ఈ మేరకు బుధవారం కమిషన్‌‌ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్‌‌ అధికారి (లీగల్‌‌) ఆర్‌‌.సుమతి 64 పేజీల అప్పీల్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఈ నెల 9న సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తుది తీర్పు వెలువరించేలోగా సింగిల్​ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ  స్టే ఆదేశాలివ్వాలని కూడా కోరారు. ఇందులో భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన పరమేశ్‌‌ మట్టాసహా 222 మంది అభ్యర్థులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీల్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టనున్నది.

పొంతన లేకుండా ఉత్తర్వులు

సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులు  పొంతనలేని విధంగా  ఉన్నాయని అప్పీల్ పిటిషన్‌‌లో టీజీపీఎస్సీ పేర్కొన్నది. ‘‘మెయిన్స్‌‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో వ్యత్యాసం ఉందని సింగిల్‌‌ జడ్జి పేర్కొనడం సబబుకాదు. నిరుడు అక్టోబర్‌‌ 27న స్పోర్ట్స్‌‌ కోటా అభ్యర్థులు 18 మందితో కలిపి 21,093 మంది ఉన్నారని పరీక్ష నిర్వహించిన రోజు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి వెల్లడించాం. తర్వాత పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ల నుంచి అందిన తుది సమాచారంతో ఆ సంఖ్య 21,110కి పెరిగింది. 

కోర్టు ఆదేశాలతో మరో 25 మంది అభ్యర్థులను పక్కన పెడితే ఆ సంఖ్య 21,085కు తగ్గినట్లు 30 మార్చి 25న ప్రకటించాం. ఇంగ్లిషులో 924 మంది అభ్యర్థులు అర్హత సాధించకపోవడంతో ఆ సంఖ్య 20,161కి తగ్గినట్లుగా అదే నెల 13న వెల్లడించాం. దీనిని శాస్త్రీయంగా వివరించినప్పుటికీ సింగిల్‌‌ జడ్జి పట్టించుకోలేదు. బొమ్మూరు పూజితరెడ్డి మార్కుల జాబితాను తారుమారు చేసి తప్పుడు ప్రచారం చేయడంపై క్రిమినల్‌‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆమె పిటిషన్‌‌ వేయకపోయినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌‌కు వేర్వేరు హాల్‌‌టికెట్లు ఇవ్వడం కరెక్టే. అభ్యర్థుల ఆన్సర్‌‌ బుక్స్‌‌ కోసం వేర్వేరు హాల్‌‌టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషయంపై నిరుడు ఆగస్టులోనే సమాచారం ఇచ్చాం. పరీక్షా కేంద్రాల సంఖ్య 45 నుంచి 46కి పెరగడంపై అభ్యర్థుల ఆందోళనకు అర్థం లేదు. అధికారులు పంపిన వివరాల ప్రకారం మొదట 45 కేంద్రాలుగా నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒక కేంద్రం  ఎత్తయిన చోట ఉంది. 

దీంతో 87 మంది దివ్యాంగుల సౌలభ్యం కోసం, వారిని సర్దుబాటు చేసేందుకు ఒక పరీక్షా కేంద్రాన్ని పెంచాల్సి వచ్చింది.  కోఠి మహిళా కాలేజీలో పురుషులకు టాయిలెట్స్‌‌ విడిగా లేనందున అక్కడ మహిళలకు సెంటర్‌‌‌‌ ఏర్పాటుచేశాం. ఈ కేంద్రంలో పరీక్ష రాసిన వారిలో 14.8 శాతం అర్హత సాధించిన తొలి 500 మందిలో ఉన్నారన్న ఆరోపణలకు ఆధారాల్లేవు” అని  టీజీపీఎస్సీ పేర్కొన్నది. 

సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

18, 19 పరీక్షా కేంద్రాల్లో  5.41, 4.12 శాతం, 6 కేంద్రాల్లో 5 కంటే ఎక్కువ శాతం ఫలితాలు వచ్చాయనే వాదన గురించి టీజీపీఎస్సీ పిటిషన్‌‌లో ప్రస్తావించింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ పర్యవేక్షణలోనే పరీక్షలు జరిగాయని పేర్కొన్నది  ‘‘ఫలితాల గణాంకాలను కోర్టు తప్పుగా పరిగణనలోకి తీసుకుంది. సాంకేతిక నియంత్రణ వినియోగంపై న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్న అంశాలు ఆమోదయోగ్యంగా లేవు. మూల్యాంకనం విషయంలో అమలు చేశాం. ఒకసారి మూల్యాంకనం చేశాక రెండోసారి, వీటి మధ్య మార్కుల 15 శాతం కంటే ఎక్కవగా ఉంటే మూడోసారి కూడా జరిపిన విషయాన్ని సింగిల్‌‌ జడ్జి పట్టించుకోలేదు. ఎవరి పేపరు వాల్యుయేషన్ చేసేదీ ఎవరికీ తెలియదు. 

వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో అనుభవం ఉన్న అధ్యాపకులనే మూల్యాంకనం కోసం వినియోగించాం. ఇంగ్లిష్‌‌లో అర్హత సాధించనివారి జవాబు పత్రాలను వాల్యుయేషన్​చేయడం ద్వారా సొంత నిబంధనలను కమిషన్‌‌ ఉల్లంఘించిందని జడ్జి పేర్కొనడం తప్పు. అన్ని జవాబు పత్రాలు ఒకేసారి మూల్యాంకనం జరిగాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మూడు భాషల్లో నిపుణులైన వారు వాల్యుయేషన్​ చేశారు. తెలుగులో పరీక్ష రాసిన వారికి అన్యాయం జరిగిందనే వాదనకు ఆధారాల్లేవు. బాధితులను ప్రతివాదులుగా చేర్చకుండా దాఖలు చేసిన పిటిషన్లు విచారణార్హం కాదని గుర్తించడంలో సింగిల్‌‌ జడ్జి పూర్తిగా విఫలమయ్యారు” అని పేర్కొన్నది. 

మా వివరణను పట్టించుకోలే

ఆన్సర్‌‌‌‌ కీకి సంబంధించి కమిషన్‌‌ విరుద్ధమైన వైఖరిని అనుసరించిందని జడ్జి పేర్కొన్నారేగానీ.. అభ్యర్థులు ఎవరూ చెప్పలేదని టీజీపీఎస్సీ  తెలిపింది.  ‘‘ఆన్సర్‌‌‌‌కు సంబంధించి సరైన వివరణ లేదంటూ కమిషన్‌‌ వైఖరిని న్యాయమూర్తి తప్పుబట్టడం సరికాదు.  పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరైనప్పుడు ఒకే తరహా మార్కులు పలువురు అభ్యర్థులకు రావడంలో తప్పేమీ లేదు. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించారన్న కారణానికి కమిషన్‌‌ ఇచ్చిన వివరణను న్యాయమూర్తి పట్టించుకోలేదు. కాబట్టి సింగిల్‌‌ జడ్జి తీర్పును రద్దు చేయండి”అని కోర్టును టీజీపీఎస్సీ కోరింది.


మా ఆధారాలను పరిగణనలోకి తీసుకోలే: టీజీపీఎస్సీ

తాము సమర్పించిన వివరాలు, ఆధారాలను సింగిల్​ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని టీజీపీఎస్సీ తన అప్పీల్​ పిటిషన్‌‌లో పేర్కొన్నది. ‘‘మున్సిపల్‌‌ కమిటీ–హోషియార్‌‌పూర్‌‌–పంజాబ్‌‌ మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వులు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేవు. తొలుత మూల్యాకనం చేసుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సింగిల్‌‌ జడ్జి.. అందుకు విరుద్ధంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని తీర్పు చెప్పడం సబబు కాదు. పునఃమూల్యాంకనం చేయాలన్న తీర్పు చట్టబద్ధంగా లేదు. 

టీజీపీఎస్సీ ఉద్యోగ నియమావళి ప్రకారం ఏ పరిస్థితుల్లోనూ మళ్లీ మూల్యాంకనం చేసేందుకు వీల్లేదు. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లో  రీకౌంటింగ్‌‌కు మాత్రమే అవకాశం ఉన్నది. చట్టంలోని సెక్షన్‌‌ 19(డి)కి వ్యతిరేకంగా పునర్​మూల్యాంకనం చేయాలన్న తీర్పు చెల్లదని ప్రకటించాలి.  ఈ నేపథ్యంలో తిరిగి పరీక్ష నిర్వహించాలన్న ఉత్తర్వులను ఆదిలోనే తిరస్కరించాలి” అని కోరింది.