
- ఓటర్లు ఈజీగా గుర్తించేలా ఈసీ కొత్త గైడ్‌లైన్స్
- బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు
- అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లెటర్లు
న్యూఢిల్లీ, వెలుగు: ఈవీఎంలను మరింత ఈజీగా చదివేలా, ఓటర్లకు సులువుగా అర్థమయ్యేలా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖలు రాసింది. బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణలో క్లారిటీ కోసం 1961 నిబంధన 49బీ కింద సవరణలు చేసినట్లు ఈసీఐ అండర్ సెక్రటరీ అభిషేక్ తివారీ తెలిపారు. గత ఆరు నెలలుగా ఈసీఐ తీసుకొన్న 28 ఇనిషియేటివ్స్(చొరవ) తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
త్వరలో బిహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం రూపొందించిన బ్యాలెట్ పేపర్లను అందుబాటులోకి తేనున్నారు. అభ్యర్థుల కలర్ఫొటోలు, సీరియల్ నంబర్లు, నోటాతో సహా అందరి పేర్లను ఒకే రకమైన, పెద్ద ఫాంట్లో సులభంగా చదివేలా ముద్రిస్తారు. ఈ మార్పులతో ఓటర్లకు అభ్యర్థులను గుర్తించడం ఈజీ అవుతుందని ఈసీఐ అభిప్రాయపడింది. ఈ గైడ్‌లైన్స్‌ను వివరిస్తూ నాలుగు పేజీల లేఖలో కొత్త నమూనా బ్యాలెట్ పేపర్‌ను జోడించారు. ఈ సవరణలు ఓటర్లకు సౌలభ్యం కల్పించడమే కాక, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయని ఈసీఐ తెలిపింది. ఈ మార్పులు భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నారు.