కామారెడ్డికి కేటీఆర్..గజ్వేల్​కు హరీశ్

కామారెడ్డికి కేటీఆర్..గజ్వేల్​కు హరీశ్
  • నియోజకవర్గ ఇన్​చార్జులుగా నియమించిన కేసీఆర్
  • మొత్తం 54 నియోజకవర్గాలకు ఇన్​చార్జుల నియామకం
  • జనగామ బాధ్యతలూ హరీశ్​కే అప్పగింత 
  • కవితకు నిజామాబాద్ అర్బన్ బాధ్యతలు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ చార్జులను బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నియమించారు. 54 నియోజకవర్గాలకు ఇన్​చార్జులు, సహ ఇన్​చార్జులను నియమిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జ్​గా మంత్రి కేటీఆర్, గజ్వేల్​ నియోజకవర్గ ఇన్​చార్జ్​గా మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. కామారెడ్డిలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్​రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ను.. గజ్వేల్​లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ ​డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ​చైర్మన్ ​వంటేరు ప్రతాప్​రెడ్డిని సహ ఇన్​చార్జులుగా నియమించారు. మంత్రి హరీశ్​రావుకు జనగామ ఇన్​చార్జ్​గానూ బాధ్యతలు అప్పగించారు. 

ఈ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్​ఘన్​పూర్​ఎమ్మెల్యే డాక్టర్​ రాజయ్యను సహ ఇన్​చార్జులుగా నియమించారు. ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్​అర్బన్, మంత్రి గంగుల కమలాకర్ కు చొప్పదండి, ఎంపీ రంజిత్​రెడ్డికి చేవెళ్ల, వికారాబాద్, మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ కు కంటోన్మెంట్, మండలి డిప్యూటీ చైర్మన్​బండా ప్రకాశ్ కు వరంగల్​ఈస్ట్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​కు మధిర బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను నియోజకవర్గ ఇన్​చార్జులుగా నియమించారు.

ఇంటింటికీ తిరగాలి: కేటీఆర్ 

పదేండ్ల బీఆర్ఎస్​పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల్లో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని కేటీఆర్​అన్నారు. నియోజకవర్గాల ఇన్​చార్జులతో ఆయన గురువారం టెలీ కాన్ఫరెన్స్​నిర్వహించారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికీ బ్రహ్మరథం పడ్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంటింటికీ తిరుగుతూ మనం ఏం చేశామో ప్రజలకు వివరించాలి. ఎన్నికల వరకు ప్రజలతోనే మమేకం కావాలి” అని ఇన్ చార్జులకు సూచించారు. వెంటనే బాధ్యతలు చేపట్టాలన్నారు. పార్టీ గెలుపు కోసం అవసరమైన కార్యచరణ చేపట్టాల్సిన బాధ్యత ఇన్​చార్జులపైనే ఉందన్నారు. శుక్రవారం నుంచి రిజల్ట్స్​ప్రకటించే వరకు ఆయా నియోజకవర్గాల పూర్తి బాధ్యత ఇన్​చార్జులదేనని తెలిపారు. 

ప్రజల్లోనే ఉండాలి: హరీశ్ 

ఈ 45 రోజులు నియోజకవర్గాల ఇన్ చార్జులందరూ ప్రజల్లోనే ఉండాలని హరీశ్​రావు సూచించారు. ‘‘బూత్​స్థాయి కమిటీల ఏర్పాటు నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. పదేండ్లలో ప్రభుత్వం చేసిన మంచిని చెప్తే బీఆర్ఎస్​ఘన విజయం సాధించడం ఖాయం. ఎన్నికలను చాలెంజ్​గా తీసుకోవాలి. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పని చేయాలి’’ అని దిశానిర్దేశం చేశారు.