అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: సీఎం రేవంత్

అందెశ్రీ కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం: సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీని కోల్పోవడం తెలంగాణకు తీరని నష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ సమాజానికే అంకితమిచ్చిన అందెశ్రీ కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఆయన రచించిన జయజయహే తెలంగాణ పాటను పాఠ్యాంశంగా తీసుకొస్తామని తెలిపారు. అందెశ్రీ రచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామని చెప్పారు. అందెశ్రీ నిప్పుల వాగు పుస్తకం ఒక గైడ్ అన్నారు. అందెశ్రీ రచనలు అన్ని లైబ్రరీల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని.. ఆయన పేరు, స్ఫూర్తి శాశత్వంగా ఉండేలా చూస్తామన్నారు. 

సోమవారం (నవంబర్ 10) అనారోగ్యంతో మృతి చెందిన అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం (నవంబర్ 11) ఘట్ కేసర్‎లో జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అందెశ్రీ అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా అందె శ్రీ పాడె మోసి సీఎం రేవంత్ కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీ చివరి వరకు సాధారణ జీవితం గడిపారన్నారు. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని  ఒక్కటిగా నడిపించారని కొనియాడారు. 

అందెశ్రీ పాట, మాట  గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని.. ఎన్నో సందర్భాల్లో ఇద్దరం కలిసి అనేక కీలక అంశాలపై చర్చించామని గుర్తు  చేసుకున్నారు. అందెశ్రీని కలిసినప్పుడల్లా సొంత అన్నను కలిసినట్టుగా ఉండేదన్నారు. గద్దర్ తో పాటు అందెశ్రీ పాటు తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చాయని అన్నారు. అందెశ్రీ జయజయహే పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని.. అందుకే జయజయహే పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామని తెలిపారు. 

ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ వ్యక్తిగతంగా తన మనసుకి దగ్గరి వ్యక్తి అని.. ఆయన లేని లోటు నా కుటుంబానికి వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని కానీ అవార్డు రాలేదన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని.. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.