బనకచర్లపై సర్కారును నిద్ర లేపిందే బీఆర్ఎస్..అనుమతులు తిరస్కరించేదాకా పోరాడినం: హరీశ్ రావు

బనకచర్లపై సర్కారును నిద్ర లేపిందే బీఆర్ఎస్..అనుమతులు తిరస్కరించేదాకా పోరాడినం: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్​ సర్కారును మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్​యేనని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగకుండా పోరాటం చేశామని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేశామన్నారు.

కనీస అవగాహన లేని వ్యక్తులు నీటిపారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని విమర్శించారు. తొమ్మిదిన్నరేండ్ల తమ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందని ప్రశ్నించారు.