
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం తాడూరు మండలం సిర్సవాడ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్అందాయా అని ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు మ్యాథ్స్పాఠం చెప్పి, వారి సందేహాలు నివృత్తి చేశారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలోనే కాకుండా ఇంట్లోనూ శుభ్రత పాటించాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి
కల్వకుర్తి, వెలుగు: ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం ఊర్కొండ మండలం మాదారంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులు శ్రీకాంత్, కృష్ణారెడ్డి భూమిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఇప్పటికే 7 వేల ఎకరాల్లో సాగవుతోందని పేర్కొన్నారు. జిల్లాలో 10 ఎకరాల భూమి కలిగిన అన్నదాతలు 60 వేల మంది ఉన్నారని, వారందరూ ఈ పంట వేయాలన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తహసీల్దార్ యూసుఫ్ అలీ
తదితరులున్నారు.