- గాజులరామారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం పర్యటన
- ఆరికెపూడి గాంధీ కబ్జాలను పట్టించుకోవట్లేదని ఆరోపణ
జీడిమెట్ల, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వం పేదల పట్ల ఒకరకంగా.. పెద్దల పట్ల మరో రకంగా ప్రవర్తిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజల బతుకులను రోడ్లపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుత్బుల్లాపూర్నియోజకవర్గం గాజులరామారంలోని సర్వే నంబర్ 307లోని 300 ఎకరాల ప్రభుత్వం స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సెప్టెంబర్‌లో తొలగించిందని, అందులోనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ 11 ఎకరాలకు వేసిన ఫెన్సింగ్తీసేసిందన్నారు. అయితే, రెండు రోజుల్లోనే గాంధీ తిరిగి ఫెన్సింగ్ఏర్పాటు చేసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు.
ఈ స్థలాన్ని పరిశీలించేందుకు తాము వచ్చామని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత- మధుసూదనాచారి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ఎమ్మెల్యే వివేకానంద్, నేతలు సునీతా లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును తప్పు బట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్నకు సైతం నోటీసులతో సరిపెట్టిందన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్లు చెరువులో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అనుకూలంగా ఉన్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోకుండా పేదల ప్రజలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మహా నగరంలో కబ్జాచేసిన అక్రమార్కుల చెరలో ఉన్న భూములను విడిపించాలన్నారు. హైడ్రా రేవంత్‌రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టే ప్రైవేట్ ఏజెన్సీలా పనిచేస్తోందన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా? : బీఆర్ఎస్ బృందానికి గాంధీ సవాల్
కూకట్పల్లి : తనపై చేసిన ఆరోపణలకు బహిరంగంగా సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని, బహిరంగ చర్చకు సిద్ధమా అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ఆరెకపూడి గాంధీ సవాల్‌విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే తనతో చర్చకు రావాలన్నారు. 1991లో తన కుటుంబసభ్యులు ఇతరులతో కలిసి చట్టబద్ధంగా కొన్న ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిరూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
గాజులరామారం పరిధిలోని సర్వేనెంబర్ 307లోని 11 ఎకరాలను తన కుటుంబసభ్యులతో సహా 9 మంది కొన్నారని, ఇది పూర్తిగా ప్రైవేటు భూమేనని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తాను ఎన్నికల అఫిడవిట్లో కూడా చెప్పానన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన 2014 తర్వాత నుంచి తన ఆస్తులపైనా, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆస్తులపైన సిట్టింగ్ జడ్జి, ఈడీ, సీబీఐ వంటి ఏ సంస్థతోనైనా విచారణ జరపాలని, దానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
ఒకవేళ అక్రమాస్తులు ఉన్నాయని తేలితే వాటిని ప్రభుత్వానికి సరెండర్చేయాలన్నారు. కూకట్పల్లి సర్వేనెంబర్ 90, ఐడీపీఎల్ భూములు, బాచుపల్లి, బౌరంపేట ప్రాంతాల్లో కృష్ణారావు చేసిన భూ ఆక్రమణలను త్వరలోనే బయటపెడతానన్నారు. తన నియోజకవర్గంలో ఆక్రమణల విషయంలో హైడ్రా చర్యలను నూరు శాతం సమర్ధిస్తున్నానని తెలిపారు. పేదలకు నష్టం కలిగితే వారి పక్షానే మాట్లాడతానన్నారు.
