
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, జిల్లా అధ్యక్షులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పోస్టర్లు, బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలుపుతున్నది. రాష్ట్రానికి వచ్చే ప్రధానికి సీఎం హోదాలో కేసీఆర్కనీసం ఆహ్వానం కూడా పలుకడం లేదు. సికింద్రాబాద్– తిరుపతి వందే భారత్రైలు ప్రారంభోత్సవం సహా, రూ. 10 వేల కోట్లకుపైగా విలువైన నేషనల్హైవేస్, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ శనివారం రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు సింగరేణి బొగ్గు బ్లాకుల అంశంపై మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో ధర్నా చేయాలని బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులను, ఎమ్మెల్యేలను కేటీఆర్ఆదేశించారు. గురువారం వారితో ఫోన్లో మాట్లాడి.. సూచనలు ఇచ్చారు. ధర్నా సక్సెస్ చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం కుప్పకూల్తది: కేటీఆర్
సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ్‌పల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఈ బ్లాకుల వేలానికి ప్రైవేటు సంస్థల నుంచి గతంలోనూ ఎలాంటి స్పందన రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవే గనులను సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మే 30లోగా ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పూర్తి చేయాలంటూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే వెనక్కి తీసుకొని, వేలంతో సంబంధం లేకుండా సింగరేణికే ఈ బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్రం పదే పదే బొగ్గు బ్లాకుల వేలానికి కుట్ర చేస్తున్నది. సింగరేణిని తెగనమ్మాలని కంకణం కట్టుకుంది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు ఐరన్‌ఓర్ గనులు కేటాయించకుండా దివాలా తీయించింది. అదే విష ప్రయోగాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చూస్తున్నది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్12న రామగుండం పర్యటనలో ప్రధాని మోడీ చెప్పారు.. కానీ ఆ మాట నిలుపుకోకుండా ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నరు” అని కేటీఆర్ ఆరోపించారు. ‘‘సింగరేణి ప్రైవేటీకరణను మానుకోకపోతే ఈసారి పురుడు పోసుకునే మహోద్యమంతో కేంద్రంకుప్పకూలుతుంది” అని కేటీఆర్ హెచ్చరించారు.