గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ డౌన్‌‌‌‌‌‌‌‌ఫాల్‌.. ‌‌‌‌‌‌‌రెండేండ్లలో రెండు సిట్టింగ్ సీట్లు గల్లంతు..!

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ డౌన్‌‌‌‌‌‌‌‌ఫాల్‌.. ‌‌‌‌‌‌‌రెండేండ్లలో రెండు సిట్టింగ్ సీట్లు గల్లంతు..!

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ బలహీనపడుతున్నది. తమకు బలమనుకున్న గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆ పార్టీ ఒక్కో సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌ను కోల్పోతున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మాత్రం 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ సిట్టింగ్ సీట్లను పోగొట్టుకున్నది. ఈ రెండు సీట్లనూ అధికార పార్టీ కాంగ్రెస్ గెలుచుకుని, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన పట్టును పెంచుకుంటున్నది. 

బీఆర్ఎస్​ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌లో మరణించడంతో 2024 జూన్‌‌‌‌‌‌‌‌లో కంటోన్మెంట్​నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ దివంగత నేత సాయన్న కుటుంబానికి ఉన్న ఆదరణతో పాటు సానుభూతి కూడా కలిసొస్తుందని భావించి లాస్య నందిత సోదరి నివేదితను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలోకి దించింది. కానీ సెంటిమెంట్ వర్కవుట్ కాకపోవడంతో ఓటమి చవిచూసింది. కంటోన్మెంట్ బైపోల్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయంతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీ బోణీ కొట్టింది.

 ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని భావించి, మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ బరిలోకి దించింది. కానీ సేమ్ కంటోన్మెంట్ సీన్‌‌‌‌‌‌‌‌ ఇక్కడా రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ బలం రెండు సీట్లకు చేరింది. మరోవైపు బీఆర్ఎస్ రెండేండ్లలో రెండు సీట్లను కోల్పోయింది.  

ప్రచారానికి ఎమ్మెల్యేలు దూరం.. 

జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో బీఆర్ఎస్ కొంత ఓవర్​ కాన్ఫిడెన్స్ ప్రదర్శించిందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆ పార్టీకి గ్రేటర్​పరిధిలో పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ జూబ్లీహిల్స్ ప్రచారానికి చాలామంది దూరంగా ఉన్నారు. కాలేరు వెంకటేశ్​, మాధవరం కృష్ణారావు, సుధీర్​రెడ్డి, మల్లారెడ్డి వంటివారు అప్పుడప్పుడు ప్రచారంలో కనిపించినా.. తలసాని శ్రీనివాస్ ​యాదవ్, పద్మారావు, బండారు లక్ష్మారెడ్డి వంటి వారు ఎక్కడా కనిపించలేదు. 

తన తండ్రి మరణించడంతో ఎమ్మెల్యే హరీశ్​రావు కొన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్​పెద్దల విధానాలు నచ్చక పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, పటాన్‌‌‌‌‌‌‌‌చెరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లేదు. మొత్తానికి గ్రేటర్​పరిధిలో అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, పార్టీని గెలిపించుకోవడంలో వాళ్లు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.  

బీఆర్ఎస్ ​నేతల్లో నైరాశ్యం.. 

జూబ్లీహిల్స్ ​బైపోల్‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా గెలుస్తామని బీఆర్ఎస్ క్యాడర్ మొదటి నుంచీ అనుకున్నది. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచే గెలుపు తమదే అన్న ధీమాలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ నియోజకవర్గమంతా తిరిగి ప్రచారం చేశారు. ఈ నెల14 తర్వాత తెలంగాణలో రాజకీయ తుఫాన్​రాబోతున్నదని, 500 రోజుల్లో బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తుందంటూ ప్రకటనలు చేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్​ అభ్యర్థి సునీతకు సానుభూతి ఓట్లు పడతాయని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ అలా జరగలేదు. ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఓటమి ఎదురుకావడంతో బీఆర్ఎస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు.  

ఆంధ్రా ఓటు బ్యాంక్ టర్న్.. 

గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆంధ్రా ఓట్​ బ్యాంక్​అంతా ఒకప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వైపే ఉండేది. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రా ఓట్​బ్యాంక్ క్రమంగా బీఆర్ఎస్​ నుంచి పక్కకు పోతున్నదని చెబుతున్నారు. ఆ ఓట్లు కాంగ్రెస్ ​వైపు మళ్లాయని అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పట్టు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.