ఇయ్యాల్నే బీఆర్ఎస్​ ఫస్ట్​లిస్ట్​

ఇయ్యాల్నే బీఆర్ఎస్​ ఫస్ట్​లిస్ట్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్​లిస్ట్​సోమవారమే రిలీజ్​కానుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్​లో ప్రెస్​మీట్​పెట్టి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్​లక్కీ నంబర్​అయిన ఆరు అంకె వచ్చేలా అభ్యర్థుల సంఖ్య ఉంటుందని చెప్తున్నారు. ముహూర్తం కూడా మధ్యాహ్నం12.03 గంటలకు ఖరారు చేశారని సమాచారం. 90 మందికి పైగా అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశముంది. 

2018 సెప్టెంబర్​6న అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత105 మందితో కేసీఆర్​ ఫస్ట్​లిస్ట్ ​ప్రకటించారు. అప్పుడు మొత్తంగా ఏడుగురు సిట్టింగ్​ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి చాన్స్​ఇచ్చారు. ఈ సారి 9 నుంచి 13 మంది సిట్టింగులను తప్పించే అవకాశముందని చెప్తున్నారు. ఇందులో సగానికి పైగా స్థానాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని సమాచారం. అభ్యర్థుల ప్రకటనతో పాటు రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీని ఎందుకు గెలిపించాలో ప్రెస్​మీట్​లో కేసీఆర్ వివరించనున్నారు. పార్టీ మేనిఫెస్టో కమిటీని సైతం ప్రకటించనున్నారని తెలిసింది. పార్టీ సెక్రటరీ జనరల్​కె. కేశవరావు, సీనియర్​నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులతో మేనిఫెస్టో కమిటీ ఉంటుందని చెప్తున్నారు.