కాంగ్రెస్​ యాడ్స్​ను ఆపేయాలి : బీఆర్​ఎస్

కాంగ్రెస్​ యాడ్స్​ను ఆపేయాలి : బీఆర్​ఎస్
  • సీఈఓ వికాస్ రాజ్​కు బీఆర్​ఎస్ ఫిర్యాదు
  • రేవంత్​ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు.. కట్టడి చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్ ను కించపరిచేలా ఉన్న కాంగ్రెస్ యాడ్స్​ను వెంటనే నిలిపివేయాలని, రెచ్చగొట్టే కామెంట్స్​ చేస్తున్న రేవంత్​ని కట్టడి చేయాలని సీఈఓ వికాస్​ రాజ్ కు బీఆర్​ఎస్​ లీగల్​ టీమ్​ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం  బీఆర్కే భవన్​లో సీఈఓను బీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు కాంగ్రెస్​ కుట్రలు చేస్తున్నదన్నారు. 

ప్రతి మీటింగ్​లో రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయన్నారు. ఆయన కామెంట్స్​ వల్లే వారం రోజుల్లో దుబ్బాక, అచ్చంపేటలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. దుబ్బాక బీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికీ సీరియస్ గానే ఉందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరుగుతుంటే..  రేవంత్ రెడ్డి కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 

పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగలేదని,  ఇప్పుడు ఎవరివల్ల జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రేవంత్ కు టీడీపీ తల్లి పార్టీ అయితే..  కాంగ్రెస్ అత్త పార్టీ అని, ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎంసీఎంసీ కమిటీకి చూపించిన యాడ్స్ ఒకలా.. బయట ప్రచారం చేస్తున్న యాడ్స్​ మరోలా ఉన్నాయన్నారు. ఈ అంశాలపై ఈసీ క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నారు.