24 గంటల కరెంట్.. ఎప్పుడూ ఇయ్యలె .. ఇచ్చినట్టు బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకున్నది: భట్టి

24 గంటల కరెంట్.. ఎప్పుడూ ఇయ్యలె ..   ఇచ్చినట్టు బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకున్నది: భట్టి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో డిస్కమ్ లకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.35,227 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, అలాంటి బీఆర్ఎస్ 24 గంటల ఉచిత కరెంట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా?’ అంటూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ‘కరెంటు కావాలి.. కాంగ్రెస్ కావాలి’ అని రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రాన్ని భట్టి ప్రవేశపెట్టి మాట్లాడారు. 

మేమే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసినం.. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులతోనే రాష్ట్రంలో నాణ్యమైన కరెంట్ అందుతోందని భట్టి చెప్పారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చినంక తామే కరెంట్ ఇచ్చామని, అంతకుముందు కరెంటే లేదనట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘యూపీఏ ప్రభుత్వం హయాంలో చేసిన సంస్కరణలతోనే దేశవ్యాప్తంగా భారీగా విద్యు త్ అందుబాటులోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నార్త్, సౌత్ కారిడార్ విద్యుత్ లింక్ చేయగలిగాం. అందువల్లే చత్తీస్ గఢ్ మిగులు విద్యుత్​ రాష్ట్రంగా ఉంది. దీంతో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేయగలుగుతున్నం. తెలంగాణ ఏర్పడే నాటికి 7,775 మెగావాట్ల  విద్యుత్ అందుబాటులో ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 5,600 మెగావాట్ల  విద్యుత్ డిమాండ్ ఉండగా, ఇప్పుడది మూడు రెట్లు పెరిగి 15,500 మెగావాట్లకు పెరిగింది” అని తెలిపారు. ‘‘తెలంగాణ విద్యుత్ అవసరాలను ఎంతో ముందుచూపుతో లెక్క వేసిన మా పాత ప్రభుత్వాలు.. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న 5,600 మెగావాట్ల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని 16,538 మెగావాట్ల కెపాసిటీతో విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వాటిలో జెన్ కో థర్మల్-2,282 మెగావాట్లు, జెన్ కో హైడల్ 2,080 మెగావాట్లు,  కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి వాటా 1,873 మెగావాట్లు, పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల నుంచి 236 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి 926 మెగావాట్లు ఉత్పత్తి అవుతున్నది” అని పేర్కొన్నారు.

కరెంట్ కొన్నరు.. ఉత్పత్తి చెయ్యలె 

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయలేదని భట్టి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఏర్పాటు చేశారని.. అందులో యాదాద్రిలో ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభమే కాలేదని పేర్కొన్నారు. భద్రాద్రిలో పనికిరాని టెక్నాలజీ తీసుకొచ్చారని, దీంతో ప్రజలపై చాలా భారం పడిందన్నారు. బీఆర్ఎస్ రెండేండ్లలో పూర్తిచేస్తామన్న భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేండ్లయినా పూర్తి కాలేదని విమర్శించారు. పెట్టుబడి ఖర్చు మెగావాటుకు రూ.6.75 కోట్ల నుంచి రూ.9.74 కోట్లకు పెరిగిందన్నారు. ‘‘బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రవాణా వ్యయం తగ్గి ఉత్పత్తి ఖర్చులు తగ్గేవి. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సకాలంలో పూర్తి చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలపై అదనంగా రూ.10 వేల కోట్ల భారం పడింది. గత పదేండ్లలో గత బీఆర్ఎస్ చత్తీస్ గఢ్ నుంచి తెచ్చిన కరెంట్ తప్ప.. రాష్ట్రంలో ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి చేయలేదు” అని చెప్పారు. ‘‘ఒక ద్రోహి ఎన్జీటీలో కేసు వేయడంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని జగదీశ్ రెడ్డి అనడం సరికాదు. ఏకపక్ష నిర్ణయంతో కట్టడంతోనే యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది. ఆ భారం ప్రజలపై పడింది. బీఆర్ఎస్ సభ్యులు కోరినట్టు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణంపైనా, చత్తీస్ గఢ్ నుంచి కొనుగోలు చేసిన కరెంట్ పైనా జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తాం” అని వెల్లడించారు.  

ర్యాంకింగ్స్ పడిపోయినయ్.. 

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల ర్యాంకింగ్స్ భారీగా పడిపోయాయని భట్టి తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల ర్యాంకింగ్స్ 2015–--16లో B ప్లస్ గ్రేడ్ ఉండగా, 2021–--22 నాటికి C మైనస్ గ్రేడ్ కు పడిపోయాయని చెప్పారు. ‘‘రాష్ట్ర డిస్కమ్ లు చెల్లింపులు చేయకపోవడంతో 2022 ఏప్రిల్ నుంచి చత్తీస్ గఢ్ కరెంట్ ఆగిపోయింది. అప్పట్లో యూనిట్ రూ.3.90కే చత్తీస్ గఢ్ కరెంట్ లభించింది. కానీ చవక కరెంట్ ను వదు లుకున్న బీఆర్ఎస్.. ఆ లోటును పూడ్చు కోవడం కోసం వందల కోట్లు వెచ్చించి మా ర్కెట్ నుంచి కొనుగోలు చేసింది. ప్రజలపై భారం మోపింది” అని పేర్కొన్నారు.