చంద్రబాబుకు తొత్తు రేవంత్రెడ్డి... బనకచర్లపై చర్చకు పోనని ఎట్ల పోయిండ్రు: కేటీఆర్

చంద్రబాబుకు తొత్తు రేవంత్రెడ్డి... బనకచర్లపై చర్చకు పోనని ఎట్ల పోయిండ్రు: కేటీఆర్
  • కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టలను అడ్డుకున్నదే చంద్రబాబు
  • ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తుండ్రు

సిరిసిల్ల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మన రాష్ట్ర సీఎం రేవంత్​రెడ్డి తొత్తు అని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. బనకచర్లపై చర్చ జరిగితే పోనని చెప్పి.. ఢిల్లీ మీటింగ్​కు ఎట్ల పోయిండ్రని ప్రశ్నించారు. ఒక కోవర్ట్​గా మారి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆదిత్యనాథ్​ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పన్న కేటీఆర్​.. కాళేశ్వరం, సితారామ ప్రాజెక్టులకు అనుమతులు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. 

చంద్రబాబు కోవర్టుల పాలన జరుగుతుందని ఒక కాంగ్రెస్​ ఎమ్మెల్యేనే చెప్పినట్లు గుర్తు చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరో ఉద్యమానికి సిద్దమని హెచ్చరించారు. కేంద్ర  ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలలో నడుస్తుందని, చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి అని చెప్పారు. 

ఇచ్చంపల్లి ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టేనని.. ఎలాంటి‌ అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని.. సీఎం రేవంత్​రెడ్డికి ఏ బేసన్ లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదన్నారు. ప్రస్తుతం రేవంత్​రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారని విమర్శించారు.