
దశాబ్దాల పోరాటం, వందలాది మంది బిడ్డల త్యాగం, అన్ని వర్గాల ఐక్య ఉద్యమం ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంపై బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నది. ఈ నిర్ణయం వెనుక కేసీఆర్ రాజకీయ వ్యూహం దాగున్నదనేది విశ్లేషకుల మాట. రాష్ట్ర సాధన కోసం నిజాయితీగా పోరాడిన ఉద్యమకారులు, ఉద్యమ ఆకాంక్షలు, కలలు ఆచరణలో ఎక్కడి దాకా వచ్చాయి అనే ప్రశ్న ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలన జనరంజకం కాదని అనేక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ విలువలు, చట్టం, రాజకీయ విలువలు అన్నిటినీ తుంగలో తొక్కి, తన మాటే చట్టంగా, తానే ఒక రాజుగా పాలిస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
తెలంగాణ ప్రాంత ఆకాంక్షల కోసం ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించారు. ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా, యువజన సంఘాలు ఒక్కటేమిటి సబ్బండ వర్గాలు త్యాగాలు చేశారు. నాటి ఉద్యమ అస్తిత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికారాన్ని పొందిన కేసీఆర్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. క్రమంగా ఉద్యమ సమయంలో తోడుగా నడిచిన సంస్థలను, వ్యక్తులను దూరం పెడుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పోరాటాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ధర్నా చౌక్ ఎత్తివేశారు. తమ హక్కుల సాధన కోసం రోడ్డు ఎక్కిన వర్గాలను వేధించారు. ఆర్టీసీ కార్మికులు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, వీఆర్ఏలు, మల్లన్న సాగర్ నిర్వాసితులు, ఇట్లా అనేకమంది వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నెలల తరబడి పోరాడాల్సి వచ్చింది. మల్లన్న సాగర్ నిర్వాసితులు కేంద్రం చేసిన నిర్వాసితుల చట్టం ప్రకారం తమకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ 900 రోజులు పాటు పోరాటం చేశారంటే ప్రభుత్వ ఎంత నియంతృత్వ ధోరణితో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పుల కుప్పైన తెలంగాణ
మన రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని పోరాడారు. కానీ వచ్చిన తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు నింపలేదు. ఉద్యమంలో 1లక్షా 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటివరకు కనీస 60 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతి సందర్భంలో నోటిఫికేషన్లు ఇవ్వడం రకరకాల అంశాలతో ఎగ్జామ్స్ వాయిదా వేయటం, లేకుంటే రద్దు చేయడం జరుగుతున్నది. రాష్ట్రంలో కనీసం ఒక్క ఎగ్జామ్ కూడా ప్రభుత్వం పారదర్శకంగా జరపలేకపోయింది. నిరుద్యోగభృతి రూ.3116 రూపాయలు హామీ కూడా అమలుకు నోచుకోలేదు.
మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఆంధ్రా వారికి కాంట్రాక్టులు అప్పజెప్పి, కమీషన్లు గుంజేందుకే ఉపయోగపడ్డాయి. గోదావరి వరదలప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, డిజైన్ లోపాలు, అవినీతి ప్రజలకు అర్థమైంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల కుప్పగా మారింది. నిధులు కొరత సాకుతో ప్రభుత్వ ఆస్తులు, భూములు అడ్డగోలుగా అమ్ముతున్నారు.
ఒక్క కుటుంబం చేతిలో పాలన
ఒకే కుటుంబానికే సర్వాధికారాలు ఉండటంతో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి కేంద్రంగా తెలంగాణ మారిపోయింది. రాష్ట్రం మొత్తం ఆ ఫ్యామిలీ చేతిలో బందీ అయింది. అధికార పార్టీల నాయకుల కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ అంతా చిక్కుకొని ప్రజల్ని హింసిస్తున్నది. దళిత గిరిజనుల సహకారం, భాగస్వామ్యం లేకుండా రాష్ట్రాన్ని సాధించలేమని భావించిన కేసీఆర్ ఆ వర్గాలకు అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ వస్తే మొదటి సీఎంగా దళితున్నే చేస్తానని, తాను కాపాల కుక్కగా ఉంటానని అనేక సభలలో ప్రకటించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు భూమి అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ సాధించుకున్న తెలంగాణలో దళిత గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధికి దోహదపడే ఏ ఒక్క పథకాన్ని సరిగా అమలు చేయలేదు.
దళితుల భూములు గుంజుకున్నరు
తొమ్మిదేండ్లు పూర్తయిన ఈ రాష్ట్రంలో నేటికీ 55 శాతం మంది దళిత కుటుంబాలకు ఒక గుంట భూమి కూడా లేదని ప్రభుత్వ నివేదిక చెప్తున్నాయి. సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి వాడుకున్నారు. వారి ఇనాం భూములు లాక్కున్నారు. దాదాపు మూడేండ్లుగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు రుణాల మంజూరు లేదు. దళితులకు గతం నుంచి ఉన్న పథకాలన్నీ అమలు చేయకుండా అటుకెక్కించి ఎన్నికల సమీపిస్తున్నప్పుడు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కొద్దిమందికి లబ్ధి చేకూర్చి తర్వాత ఆ పథకాన్ని నీరుగాస్తున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వకపోగా దళితుల చేతుల్లో ఉన్న అసైన్మెంట్ భూములు లాక్కున్నారు.
గ్రామాలలో శ్మశాన వాటికలకు, పల్లె ప్రకృతి వనాలకు, రైతు వేదికలకు డంపింగ్ యార్డ్ లకు, ఇలా ప్రభుత్వ ఏ అవసరానికైనా సరే దళితుల చేతుల్లో ఉన్న భూములనే లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్నది. కేసీఆర్ తన మాయమాటలు, చెప్పుచేతల్లో ఉన్న మీడియాతో ప్రజలను మోసం చేస్తున్నారు. రాజకీయంగా షార్ప్ టర్న్స్ తీసుకొని అర్థంకాని ఎత్తులు వేస్తున్నాడు. స్వపక్షానికి కళ్లు చెవులు మూసి ప్రతిపక్షాలను డబ్బులతో కొని తెలంగాణ సంపదని దోచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆనాటి పోరాట స్ఫూర్తితో ప్రజలే ప్రతిపక్షంగా మారి తెలంగాణని రక్షించాల్సిన బాధ్యత ఉంది.
పేదలకు గజం జాగా ఇయ్యలె
2014 నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటి జాగను ఇవ్వలేదు. సరైన ఇల్లు లేని కుటుంబాల సంఖ్య రాష్ట్రంలో 67% ఉన్నాయని కూడా ఆయన ప్రభుత్వమే చెప్తుంది. దీనికి సమగ్ర సర్వేనే ఆధారం. ఆర్థికంగా మనకన్నా బలహీనమైన పక్క రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇండ్ల జాగాలు పంపిణీ చేయలేదు. డబల్ బెడ్ రూమ్ పథకాన్ని అటుకెక్కించారు. మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయం పండుగగా మారిందని, రైతులందరూ సంతోషంగా ఉన్నారని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా కోటీశ్వరులు, వ్యవసాయం చేయనివారే అధికంగా లాభ పడుతున్నారు.
18లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందడంలేదు. రైతు రుణాలు మాఫీ, నష్టపోతే ఆదుకునేందుకు పంటల బీమా లేదు, పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసే దిక్కులేదు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్న సీఎం రాష్ట్రంలో విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేసి గురుకులాల పేరులో కేవలం ఆరు లక్షల మందికి విద్య అందిస్తే చాలా? విద్యారంగ దుస్థితిపై 9 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా కేసీఆర్ అధికారిక రివ్యూ చేయలేదు. యూనివర్సిటీలో, స్కూళ్లలో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ విద్య కునారిల్లుతున్నది. విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు మరిచిపోయారు.
ఉద్యోగులు, టీచర్ల మనోవేదన
పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగస్తులే. ఇంతటి ముఖ్యమైన ఉద్యోగులు, టీచర్లను కేసీఆర్ ప్రభుత్వం నిరాదరణకు గురిచేస్తున్నది. వేతనాలు కోల్పోయి, రోడ్లమీద చేరి ఎన్నో కష్టాలకు ఓర్చి పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. కేంద్ర ఉద్యోగులకు సమానంగా వేతనాలు, టీచర్లకు కామన్ సీనియారిటీ, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు, ఖాళీల భర్తీ, ప్రమోషన్స్, అంతర్ జిల్లాల బదిలీలు, మొదలైనవి అన్ని చేసుకుందామని ఆనాడు ఉద్యమ నాయకుడుగా ఉన్న కేసీఆర్ హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు బదిలీలు, ప్రమోషన్స్ చేపట్టకుండా, పీఎఫ్, మెడికల్ రియింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. జీతాలు ఒకటో తారీఖు రాకవట్లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటున్నాయి.
317జీవో లాంటి చాలా అంశాలు ఉద్యోగ, టీచర్లను మనోవేదనకు గురిచేస్తున్నాయి. సగటు ఉద్యోగి ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంటే, ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రం నేటికీ భ్రమలు తొలగట్లేదు. పదవీవిరమణ తర్వాత ఏదైనా గిట్టుబాటు అయితదేమో అని వీరు ఎదురుచూస్తున్నారేమో. ఉద్యోగ, టీచర్ల నాయకులకు ఉద్యోగుల బాధలను కేసీఆర్ దగ్గర ప్రస్తావించే ధైర్యం లేదు. వారు చేస్తున్నదల్లా ఉద్యోగులు పిడికిలి బిగించకుండా నివారించడం.
‑ ఆవుల అశోక్ సీపీఐ (ఎంఎల్) ప్రజా పంథా రాష్ట్ర నాయకుడు