- అన్ని నియోజకవర్గాల్లో హస్తం పార్టీ సర్పంచ్ మద్దతుదారుల విజయకేతనం
- గ్రేటర్ పరిధితో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నో ఎలక్షన్
- 1,493 జీపీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
- 989 జీపీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే సర్పంచులు
- 475 స్థానాల్లో బీఆర్‍ఎస్, బీజేపీ తరఫున 26 మంది గెలుపు
- 2 జీపీల్లో సీపీఎం, ఖాతా తెరవని సీపీఐ
వరంగల్, వెలుగు: ఓరుగల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే పల్లె జనాలు జై కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ 6 జిల్లాల్లో 12 నియోజకవర్గాలు ఉండగా, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలు పూర్తిగా గ్రేటర్ సిటీ పరిధిలో ఉండటంతో ఇక్కడ పంచాయతీలు లేవు. మిగిలిన 10 నియోజకవర్గాల పరిధిలో 1,493 జీపీలు ఉండగా, 1,492 చోట్ల ఫలితాలు వచ్చాయి. ఇందులో 989 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులనే పల్లె ఓటర్లు సర్పంచులుగా గెలిపించారు.
9 నియోజకవర్గాల్లో హస్తం., జనగామలో గులాబీ
స్థానిక సంస్థల ఎన్నికలు 10 నియోజకవర్గాల్లో జరగగా, భూపాలపల్లి, ములుగు, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‍పూర్, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అత్యధికంగా సర్పంచులుగా విజయం సాధించారు. ఈ స్థానాల్లో బీఆర్‍ఎస్ కి హస్తం పార్టీకి వచ్చిన సీట్లల్లో సగం కూడా రాలేదు. కాగా, జనగామ నియోజకవర్గంలో బీఆర్‍ఎస్‍కి చెందిన ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‍రెడ్డి ఉండటంతో కాంగ్రెస్ కంటే బీఆర్‍ఎస్ కాంగ్రెస్ కన్నా 8 పంచాయతీలను ఎక్కువగా తన ఖాతాలో వేసుకుంది.
బీఆర్‍ఎస్ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍తో పాటు మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో హస్తం హవాను అడ్డుకోలేకపోయారు. చివరకు ఎర్రబెల్లి కంచుకోటగా చెప్పుకునే వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఆయన సొంత గ్రామం పర్వతగిరిలోనూ కాంగ్రెస్ మద్దతు అభ్యర్థే విజయం సాధించారు.
బీజేపీకి 3 నియోజకవర్గాల్లో సున్నా..
కేంద్రంలో నరేంద్రమోదీ రూపంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. 8 మంది ఎంపీలుగా ఉన్నారు. అయినా రాజకీయాలకు బలంగా నిలిచే పల్లెపోరులో మాత్రం బీజేపీ ఫలితాలు ఆకట్టుకోలేకపోయాయి. ఓరుగల్లులోని 10 నియోజకవర్గాలు, 1493 స్థానాల్లో కేవలం 26చోట్ల మాత్రమే కమలం పార్టీ మద్దతుదారులు సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు. డోర్నకల్, ములుగు, పాలకుర్తి నియోజకవర్గాల్లో కనీసం ఖాతా తెరవలేదు. సీపీఎం పార్టీ డోర్నకల్, జనగామ నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున గెలవగా, సీపీఐ పార్టీ ఓరుగల్లులో జీరోగా నిలిచింది.
