- రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్
- ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోని బీజేపీ
- కొన్ని మండలాల్లో పోరాడిన కమ్యూనిస్టులు
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మరోసారి ఉమ్మడి జిల్లా తమకు కంచుకోటగా హస్తం పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను గెల్చుకుంది. ఖమ్మం జిల్లాలో 566 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ 407 సర్పంచ్ స్థానాలను, బీఆర్ఎస్ 124 గ్రామాలను గెల్చుకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీలకు గానూ 468 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 290 పంచాయతీలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా, 96 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కమ్యూనిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. సీపీఐకి గతంలో కంటే ఈసారి సర్పంచులు పెరిగారు.
అభివృద్ధికి కోసం అధికార పార్టీ వైపు..
ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదు అంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు చేసిన ప్రచారానికి ప్రజలు మద్దతు తెలిపినట్టు కనిపిస్తోంది. జిల్లాలో మూడొంతులకు పైగా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు గెలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి కార్నర్ మీటింగ్ తరహాలో ఎలక్షన్ ప్రచారం చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మేనల్లుడు, ఖమ్మం క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగారు. దీంతో ఓటింగ్ సరళిపై ఆ ప్రభావం స్పష్టంగా కనబడింది. ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటు, అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీకి మద్దతివ్వాలంటూ వారు ప్రచారం చేశారు.
పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు, ఆ తర్వాత మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ బుజ్జగింపులకు తోడు ఆర్థిక సహకారం కూడా అందించడంతో కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు సాధ్యమైంది. బీఆర్ఎస్ కొన్ని మండలాల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చినా, మరికొన్ని చోట్ల తేలిపోయింది.
కల్లూరు, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్వాలేదనిపించింది. ఇక కమ్యూనిస్టులు కూడా పర్వాలేదనిపించారు. సీపీఐ మద్దతిచ్చిన అభ్యర్థులు 9 మంది గెలవగా, సీపీఎం మద్దతుదరులు 23 చోట్ల విజయం సాధించారు. టీడీపీ మద్దతిచ్చిన వారు 4 చోట్ల గెలిచారు. బోనకల్, చింతకాని, ఖమ్మం రూరల్ మండలాల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీ చేయడం ఈ రెండు పార్టీలకూ కలిసి వచ్చిందన్న అభిప్రాయాలున్నాయి.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగా, బీఆర్ఎస్ చతికిల పడింది. కమ్యూనిస్టులు ఉనికిని చాటుకున్నారు. జిల్లాలో 471 పంచాయతీలకు గానూ జూలూరుపాడు, ముల్కలపల్లి, పాండురంగా పురం గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగలేదు. 468 పంచాయతీలకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (రెబల్స్‌తో కలుపుకొని)అత్యధికంగా 290 సర్పంచ్స్థానాలను కైవసం చేసుకొని జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. బీఆర్ఎస్ 96 స్థానాలకే పరిమితమైంది.
ఒకటి, రెండు విడతల్లో కొంత మెరుగైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ మూడో విడతలో చతికిల పడింది. మూడో విడతలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. సీపీఐ పార్టీ జిల్లాలో 47 స్థానాలను కైవసం చేసుకోగా సీపీఎం 15 స్థానాలతో ఉనికిని చాటుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సొంత నియోజకవర్గమైన కొత్తగూడెంలో సీపీఐ 35 స్థానాలు గెలుచుకోవడం విశేషం. జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బోణి కొట్టలేదు. సర్పంచ్ స్థానాల్లో కనీసం రెండో స్థానంలో కూడా నిలవని పరిస్థితి నెలకొంది.
