సింగరేణి సిగలో.. జల సింగారం !..‘నీటి బిందువు.. జల సింధువు’ పేరుతో చెరువుల తవ్వకం

సింగరేణి సిగలో..  జల సింగారం !..‘నీటి బిందువు.. జల సింధువు’ పేరుతో చెరువుల తవ్వకం
  • 11 ఏరియాల్లో 62 చెరువులు తవ్విన సింగరేణి
  • ఆయా చెరువుల్లో మొత్తం 663 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ
  • మరో 45 చెరువుల్లో పూడికతీత పనులు

హైదరాబాద్, వెలుగు : ‘నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తవ్విన చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. సింగరేణి గనుల పరిధిలో భూగర్భ జలాల పెంపుతో పాటు సాగు, జంతువుల తాగు నీటి అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంతో సింగరేణి గతంలో చెరువుల తవ్వకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సంస్థ పరిధిలోని పలు గనుల ప్రాంతాల్లో చెరువులను తవ్వగా... ఆయా చెరువులు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. చెరువుల తవ్వకం కోసం మొత్తం 3.03 లక్షల క్యూబిక్‌‌ మీటర్ల మట్టిని వెలికి తీసినట్లు ఆఫీసర్లు తెలిపారు.

11 ఏరియాల్లో 62 చెరువుల నిర్మాణం

సింగరేణి సంస్థకు రాష్ట్రంలో మొత్తం 38 బొగ్గు గనులున్నాయి. వీటిలో 22 భూగర్భ, 16 ఓపెన్‌‌ కాస్ట్‌‌ గనులు. సంస్థలో మొత్తం 41 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతీ రోజు 72 మిలియన్‌‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంటారు. అయితే బొగ్గు గనుల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని స్థానికుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తేవి. 

దీంతో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ యజ్ఞంలో భాగంగా సింగరేణి సంస్థ సైతం ‘నీటి బిందువు.. జల సింధువు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సింగరేణి గనులు విస్తరించిన 11 ఏరియాల్లో 65 కొత్త చెరువులను తవ్వడంతో పాటు 45 పాత చెరువుల్లో పూడిక తీయాలని భావించింది. ఇందుకోసం సంస్థకు చెందిన సీఎస్‌‌ఆర్‌‌ నిధులను కేటాయించారు. చెరువుల తవ్వకం పనులను ఏప్రిల్‌‌లో మొదలుపెట్టగా ఇప్పటివరకు 62 చెరువుల తవ్వకం పూర్తయ్యింది.

663 లక్షల గ్యాలన్ల నీటి నిల్వ

సింగరేణి పరిధిలోని కొత్తగూడెం గనుల పరిధిలో అత్యధికంగా ఎనిమిది చెరువులను తవ్వారు. అలాగే రామగుండం–1లో ఏడు, మణుగూరు, ఇల్లందులో ఆరు చొప్పున, భూపాలపల్లి, రామగుండం–2, రామగుండం–3, శ్రీరాంపూర్‌‌, మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్‌‌ ఎస్‌‌టీపీపీ ప్లాంట్‌‌ గనుల వద్ద ఐదు చొప్పున మొత్తం 62 కొత్త చెరువులను తవ్వారు. ఈ చెరువుల చుట్టూ గట్లను నిర్మించడంతో పాటు చెరువులోకి వరద నీరు వచ్చేందుకు, వెళ్లేందుకు వీలుగా కాల్వలను తవ్వారు. ఈ చెరువుల్లో మొత్తం 663 లక్షల గ్యాలన్ల నీటిని ఒడిసిపట్టినట్లు సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే ఆయా ఏరియాల్లో గుర్తించిన 45 చెరువుల్లో పూడిక సైతం తీశారు. 

ఇదో కొత్త అధ్యాయం ! 

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 62 కొత్త చెరువులను తవ్వడం ద్వారా కొత్త​అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అయ్యింది. సింగరేణి గనుల ప్రాంతంలో జల వనరులను, భూగర్భ జలాలను పెంపొందించేందుకే కోసం ఈ పనులు చేపట్టాం. అనతికాలంలోనే చెరువుల తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడీ చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వీటిని వ్యవసాయ సాగు, పశువుల తాగునీటి కోసం ఉపయోగిస్తాం.​   - సింగరేణి ఆఫీసర్లు