మూడు విడతల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే పైచేయి

మూడు విడతల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌దే పైచేయి
  • ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 1,487 జీపీలకు ఎన్నికలు 
  •  948 స్థానాల్లో విజయం సాధించిన అధికార పార్టీ 
  •  375కు పరిమితమైన బీఆర్ఎస్, 88తో సరిపెట్టిన బీజేపీ 
  •  సీపీఐ 2, సీపీఎం 2, టీడీపీ 1తోపాటు 71 స్థానాల్లో ఇండిపెండెంట్ల గెలుపు 

కరీంనగర్, వెలుగు: మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 1,487 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 948 సర్పంచ్ స్థానాలను(63.75 శాతం) కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ కైవసం చేసుకున్నారు. గతంలో ఉన్న వందలాది సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్  కోల్పోయి 375 స్థానాలకే పరిమితమైంది. 

కరీంనగర్, నిజామాబాద్ లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లో చతికిలపడిపోయింది. ఈ 13 నియోజకవర్గాల్లో కలిపి కేవలం 88 సర్పంచ్ స్థానాలు మాత్రమే దక్కించుకుంది. సీపీఐ, సీపీఎం రెండు చొప్పున, టీడీపీ ఒక సర్పంచ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. 

మూడు దశల్లోనూ స్పష్టమైన ఆధిక్యత.. 

ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం మినహా మిగతా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చాలా వెనకబడిపోయింది. 

జగిత్యాల నియోజకవర్గంలో 101 జీపీలకు గానూ 90 చోట్ల కాంగ్రెస్ గెలవగా, బీఆర్ఎస్ కేవలం 2 చోట్ల, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. రామగుండం నియోజకవర్గంలో 27 జీపీలకుగానూ 23 సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్  కేవలం 4 చోట్ల గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. 

కరీంనగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సర్పంచ్ కూడా గెలవలేదు. కానీ ఈ సారి 20 గ్రామాలకుగానూ 11 పంచాయతీల్లో విజయబావుటా ఎగురవేసింది. కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వీరి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నియోజకర్గంలోని మెజార్టీ పంచాయతీల్లో బీజేపీ పోటీ చేసిన చోట బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, బీఆర్ఎస్ పోటీ చేసిన చోట బీజేపీ పోటీ చేయకపోవడం గమనార్హం.

 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే టార్గెట్‌‌‌‌‌‌‌‌గా స్థానికంగా రెండు పార్టీల లీడర్లు అవగాహనతో పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మిగతా వేములవాడ, రామగుండం, మంథని, ధర్మపురి, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, కోరుట్ల, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబరిచింది.