మేం కార్యకర్తల్ని పట్టించుకోలే..అందుకే ఓడినం: కేటీఆర్

మేం కార్యకర్తల్ని పట్టించుకోలే..అందుకే ఓడినం: కేటీఆర్
  •  
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ వ్యాఖ్యలు
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేకపోతున్నరు
  • సీఎం చెప్పినట్లు స్పీకర్​ ఆడుతున్నరు
  • ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శ

యాదాద్రి, వెలుగు:  తాము పదేండ్లు అధికారంలో ఉండి కూడా పార్టీని, కేడర్​ను పక్కకు పెట్టి తప్పు చేశామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. 2023 ఎన్నికల్లో కేడర్​ కూడా తమను పట్టించుకోకపోవడంతో  ఓడిపోయామని ఆయన పేర్కొన్నారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని బీఆర్​ఎస్​ ఆఫీసులో  కొత్త సర్పంచులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న మనం తప్పు చేసినం. పార్టీ కేడర్​ను పట్టించుకోలేదు.. కమిటీలు వేయలేదు. పార్టీని బలోపేతం చేయడాన్ని మరిచిపోయినం.  సర్పంచ్​లు, ఎంపీటీసీలను పట్టించుకోలేదు. వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లు ఉత్సాహంగా పని చేయలేదు. ఆ ఎన్నికల్లో మనల్ని ఓడించింది.. కాంగ్రెస్, బీజేపీ కాదు. మనల్ని మనమే ఓడించు కున్నం” అని తెలిపారు. ఇప్పట్లో పరిషత్​ ఎన్నికలు  రాకుంటే  పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతామని, వస్తే ఎన్నికల్లో కొట్లాడుతామని చెప్పారు.  

ఆ ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేకపోతున్నరు

‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. కడియం శ్రీహరి.. కమిట్​ మెంట్​, కాకరకాయ అంటు మాట్లాడుతడు. ఇప్పుడేమైంది? పోచారం శ్రీనివాస్​రెడ్డి సంపాదించుకున్న గౌరవాన్ని 70 ఏండ్ల వయసులో రేవంత్ రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నడు. గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైంది” అని కేటీఆర్​ విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు స్పీకర్​ ఆడుతున్నారని, ఫిరాయింపులు ఆయనకు కనిపించడం లేదని దుయ్యబట్టారు.  అధికారం  పోగొట్టుకున్న చోటే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పూర్వ వైభవాన్ని సాధించిందని కేటీఆర్​ అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయినా.. యాదాద్రి జిల్లాలో 161 మంది సర్పంచులను గెలిపించుకున్నాం. ఈ గెలుపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. వచ్చే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి” అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని.. అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులని.. ఏ ఎమ్మెల్యే కూడా వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. 

పింక్​ బుక్​లో రాసుకుంటున్నం: మాజీ ఎమ్మెల్యేలు

అధికార పార్టీకి ఆఫీసర్లు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్​, కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి ఆరోపించారు. ‘‘అన్నింటినీ పింక్​బుక్​లో రాసుకుంటున్నం. రెండేండ్లలో అధికారంలోకి వచ్చేదీ మేమే. అప్పుడు ఒకటికి రెండు బదులు తీర్చుకుంటం” అని వారు హెచ్చరించారు.