- మూడు విడతల్లోనూ ఆధిక్యం
- కాంగ్రెస్ కు 1248 జీపీలు
- బీఆర్ ఎస్ కి 476, బీజేపీ కి 22
- పలుచోట్ల బీఆర్ఎస్, బీజేపీల మధ్య దోస్తీ
నల్గొండ/యాదాద్రి, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి రుజువైంది. పలుచోట్ల బీఆర్ఎస్,బీజేపీ పరస్పరం సహకరించుకున్నా .. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ 63.90 శాతం స్థానాల్లో , బీఆర్ఎస్ 26.71 శాతం, బీజేపీ 1.23 శాతం స్థానాల్లో గెలిచాయి. ఇండిపెండెంట్లకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1782 గ్రామ పంచాయితీలున్నాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభ్యంగపురంలలో సర్పంచ్‌గా నామినేషన్లు రాలేదు. ఇదే మండలంలోని ఇందుగులలో హైకోర్టు జోక్యంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 1779 గ్రామాల సర్పంచులకు, 1781 గ్రామాల్లో వార్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడువిడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 1248 స్థానాలు, బీఆర్ఎస్ 476 స్థానాలు, బీజేపీ 22 స్థానాలు, సీపీఐ, సీపీఎం పార్టీలు 33 స్థానాలు గెలుచుకున్నాయి. జిల్లాల వారీగా చూస్తే.. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ 68.23శాతం, బీఆర్ఎస్ 23.24 శాతం స్థానాలు, సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ 64.60 శాతం, బీఆర్ఎస్ 25.51 శాతం, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ 53.75 శాతం, బీఆర్ఎస్ 35.97 శాతం స్థానాలు దక్కించుకున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీ పరస్పర సహకారం
బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహం కొనసాగిందన్న వాదన వినిపిస్తోంది. ఈ దోస్తీ వల్ల బీఆర్ఎస్ ఎక్కువ చోట్ల గెలిచిందని , బీజేపీ చాలా చోట్ల కారుకు సహకరించిందని ఆరోపణలున్నాయి. హుజూర్ నగర్, తుంగతుర్తి, దేవరకొండ, మునుగోడు, ఆలేరు, నకిరేకల్ నియోజక వర్గాల్లో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేదు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఖాతా కూడా తెరవలేదు. సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ చల్లా శ్రీలత రెడ్డి, బీజేపీ నేత శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన వారే అయినా ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని అంటున్నారు.
కమ్యానిస్టుల పట్టు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు తమ పట్టు చూపించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి 33 స్థానాల్లో గెలిచారు. కమ్యూనిస్టుల కంచుకోట సూర్యాపేట జిల్లాలో 10 మంది సర్పంచులు, 8మంది ఉపసర్పంచులు,113వార్డులు గెలిచారు.
