మూడు నెలలు.. 40 వేల కోట్లు.. ఓటర్లే లక్ష్యంగా పథకాల పేరుతో కుమ్మరించేందుకు రాష్ట్ర సర్కార్​ ప్లాన్​

మూడు నెలలు.. 40 వేల కోట్లు..  ఓటర్లే లక్ష్యంగా పథకాల పేరుతో కుమ్మరించేందుకు రాష్ట్ర సర్కార్​ ప్లాన్​
  • మూడు నెలలు.. 40 వేల కోట్లు
  • ఓటర్లే లక్ష్యంగా పథకాల పేరుతో కుమ్మరించేందుకు రాష్ట్ర సర్కార్​ ప్లాన్​ 
  • ఎలక్షన్ టైమ్‌‌లో ప్రయోజనం పొందవచ్చని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు
  • ఓఆర్ఆర్ లీజు, భూముల అమ్మకాల డబ్బులు, తెచ్చేఅప్పులు అన్నీ వాటికే
  • ఎన్నికల షెడ్యూలుకు ముందే నిధులు రిలీజ్​ చేసే యోచన

హైదరాబాద్, వెలుగు:  ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. రానున్న మూడు నెలల్లో ఏకంగా రూ.40 వేల కోట్ల మేర ఖర్చు చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. వివిధ పథకాలను అమలు చేయడంతోపాటు.. పెండింగ్‌‌లో ఉన్న వాటికి కొంత మేర అయినా నిధులివ్వాలని చూస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో.. ఓఆర్ఆర్ లీజు పైసలు, అప్పులు, భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఎంత వస్తే అంత వాడుకోవాలని నిర్ణయించింది. రైతుబంధు, దళితబంధు, గృహలక్ష్మి, బీసీలకు రూ.లక్ష ఆర్థిక చేయూతతో పాటు ఇప్పటికే రూ.వేల కోట్లు పెండింగ్‌‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌‌‌‌షిప్‌‌లు, కేసీఆర్ కిట్, పల్లెలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి వంటి వాటికి కూడా కొంతమేర నిధులు ఇవ్వనుంది. ‘ప్రభుత్వం పని చేస్తున్నది.. స్కీములన్నీ అమలు చేస్తున్నది’ అనే భావన జనాల్లో వస్తుందని, ఎలక్షన్ టైమ్‌‌లో లబ్ధి పొందవచ్చని సర్కార్ పెద్దలు అనుకుంటున్నట్లు తెలుస్తున్నది.

ఎన్నికల షెడ్యూల్ రాకముందే నిధులను విడుదల చేసి, ఖర్చు చేయాలని చూస్తున్నది. ఒకవేళ ఎలక్షన్ షెడ్యూల్​ వచ్చి, ఈసీ ఆదేశాలతో ఏదైనా ఆగి పోతే.. దాన్ని ప్రతిపక్షాల మీద నెట్టేసేందుకూ చాన్స్ ఉంటుందని అనుకుంటున్నది. అందులో భాగం గానే జులై నుంచి నిధుల వరద పారించేందుకు ప్లాన్ చేసుకున్నది. సెప్టెంబర్ దాకా ప్రతి స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా వానాకాలం సీజన్ రైతుబంధుకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయ నున్నారు. ఇది ఈ నెలఖారులో లేదంటే జులై ఫస్ట్ వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదలుపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దళితబంధు కోసం 5వేల కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. వాస్తవానికి ఈ స్కీమ్​ కింద రూ.17,700 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. దీంతో పాటు గృహలక్ష్మి స్కీమ్​ కింద రూ.3 వేల కోట్ల నుంచి రూ.4వేల కోట్ల దాకా ఇవ్వనున్నారు. బీసీలకు ఆర్థిక చేయూత కింద ఇచ్చే రూ.లక్ష కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుంది. రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గిరిజన సంక్షేమ శాఖలో కొన్ని సబ్సిడీ స్కీముల కోసం రూ.300 కోట్లు ఎక్స్​పెండిచర్​కు ప్రపోజల్స్ రెడీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మన ఊరు మన బడి, స్కాలర్ షిప్ లు తదితరాలకు రూ.6 వేల కోట్లు రిలీజ్ చేసి, ఖర్చు చేసేలా ప్లాన్ చేస్తున్నది.

నిధుల సర్దుబాటుపై ఫోకస్

ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో నిధుల సర్దుబాటుపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను టీవోటీ పద్ధతిలో లీజుకు ఇవ్వడంతో రూ.7,300 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతున్నాయి. దీంతో రైతుబంధుకు అవసరమైన నిధులన్నీ ఇవ్వొచ్చు. మరోవైపు భూముల అమ్మకాన్ని కూడా సర్కార్ స్పీడప్​ చేసింది. భూముల అమ్మకంతోనూ ఈ మూడు నెలల్లో ఎలాగైనా రూ.10 వేల కోట్లు వచ్చేలా చూసుకోవాలని నిర్ణయించింది. ఇక అప్పులు సరేసరి. యావరేజ్​గా మూడు నెలల కాలంతో తీసుకునే రాష్ట్ర అప్పు రూ.14 వేల కోట్లు ఉంటుంది. వేస్ అండ్ మీన్స్, గ్యారంటీతో పాటు ఇతర మార్గాల నుంచి ఇంకో రూ.3 వేల కోట్లు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర సర్కార్​కు సొంతంగా వచ్చే ఆదాయంలో కొంతమేర ఖర్చు చేయనుంది. ఇప్పుడు ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు టాక్స్ లు, కేంద్ర పన్నుల వాటాతో వస్తున్న మొత్తం రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు మాత్రమే ఉన్నది. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.5 వేల కోట్ల మేర ఖర్చు అవుతున్నది. గత అప్పుల రీ పేమెంట్స్, వడ్డీలకు ఇంకో రూ.5 వేల కోట్లు వెళ్తున్నది. మిగిలిన ఇంకొంత మొత్తం ముఖ్యమైన స్కీములకు సర్దుబాటు చేస్తున్నది.