మూతపడుతున్న కాలేజీలు.. విద్యార్థుల రీయింబర్స్​మెంట్​ బకాయిలేవి?

మూతపడుతున్న కాలేజీలు..  విద్యార్థుల రీయింబర్స్​మెంట్​ బకాయిలేవి?

కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యావ్యవస్థ.. ప్రభుత్వ ప్రత్యేక దృష్టి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. గత రెండు సంవత్సరాలుగా అకడమిక్ ఇయర్ అస్తవ్యస్తంగా మారింది. ఈ అకడమిక్ ఇయర్​  ప్రారంభంతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యలోకి లక్షలాది విద్యార్థులు అడుగిడుతున్నారు. ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్ల(దోస్త్) ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియ చివరి దశలో ఉంది. పీజీ విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించే బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి మెజార్టీ విద్యార్థులు ప్రభుత్వం అందించే పీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పై ఆధారపడి చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత రెండు మూడేండ్లుగా విద్యార్థులకు చెల్లించాల్సిన దాదాపు రూ.5,000 కోట్ల స్కాలర్‌‌‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. దీంతో దాదాపు15 లక్షల మంది విద్యార్థులకుపైగా అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

మూతపడుతున్న కాలేజీలు

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏనాడూ సకాలంలో ఫీజులు చెల్లించిన దాఖలాలు లేవు. ఫలితంగా ఏటా స్కాలర్‌‌‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిల విడుదల కోసం వేడుకోవడం, ధర్నాలు, రాస్తారోకోలు చేయక తప్పడం లేదు. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో చదువులు అయిపోయినా కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ముందు డబ్బులు కట్టాలని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో డబ్బుల్లేక చాలామంది స్టూడెంట్ల పేరెంట్స్ అప్పులు చేసి చెల్లించి, సర్టిఫికెట్లను తీసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడా అప్పు పుట్టని పేద, మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేస్తున్నారు. ఫలితంగా వారి పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు.. ఫీజు రీయింబర్స్​మెంట్​పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాక ప్రైవేట్ బడ్జెట్​ కాలేజీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. లెక్చరర్లకు జీతాలు చెల్లించలేక ప్రతి నెల నానా అవస్థలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమస్యలతో కాలేజీలను నడపలేక గత కొన్నేండ్లుగా నిర్వహణ భారంతో దాదాపు300 కాలేజీల వరకు మూతపడినట్లు అంచనా. సమాజం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలాంటే విద్యది ప్రధాన పాత్ర. పేద, మధ్యతరగతి జీవుల బతుకులను మార్చే శక్తివంతమైన ఒకే ఒక్క ఆయుధం విద్య. అలాంటి విద్యను రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా దెబ్బతీస్తున్నది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ.. పేద, బడుగులను విద్యకు దూరం చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలి. 

వేల కోట్ల బకాయిలు

తెలంగాణలో ఏటా సుమారు 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్లకు స్కాలర్‌‌‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రూ.2,400 కోట్లు అవసరమవుతాయి. 2019–20 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఇప్పటికీ రూ.800 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. 2020–21 అకడమిక్ ఇయర్ లో రూ.2,300 కోట్లలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. 2021-22 ఏడాదిలోనూ అదే పరిస్థితి. అధికారులు స్టూడెంట్లకు స్కాలర్‌‌‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ శాంక్షన్‌‌‌‌ చేసేస్తూ, టోకెన్లు జారీ చేస్తున్నా అకౌంట్లలో మాత్రం డబ్బులు పడటం లేదు. మొత్తం రెండేండ్లకు కలిపి రూ.3,100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖలో ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల నూజివీడు రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలో చదువు తున్న  దాదాపు వెయ్యి మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు లేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేక ఇబ్బంది పడ్డారు. 

- గడ్డం శ్యామ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీడీఎస్​యూ