జహీరాబాద్​ బీఆర్​ఎస్​కు వలసల గండం

జహీరాబాద్​ బీఆర్​ఎస్​కు వలసల గండం
  • పార్టీని వీడుతున్న సెకండ్​ లెవెల్​ క్యాడర్​
  • ఊపందుకుంటున్న కాంగ్రెస్​, బీజేపీ ప్రచారాలు

సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్  పరిధిలో బీఆర్​ఎస్​ను వలసల గండం వెంటాడుతోంది. ఈ స్థానంలో  బీజేపీ అభ్యర్థిగా  బీబీ పాటిల్, కాంగ్రెస్  నుంచి  సురేశ్​ షెట్కార్,  బీఆర్​ఎస్​ అభ్యర్థిగా  గాలి అనిల్ కుమార్  పోటీలో ఉన్నారు.   బీఆర్​ఎస్​ అభ్యర్థి ఈ సెగ్మెంట్ కు కొత్త వ్యక్తి కావడంతో ఆ పార్టీ క్యాడర్  అసంతృప్తిలో ఉన్నారు.  దీంతో ఆ పార్టీ సెకండ్​ క్యాడర్​ ఇతర పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ఇప్పటికే వెళ్లిపోయిన కీలక నేతలు  

జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని   పట్టణ, గ్రామ స్థాయిలలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది.  జహీరాబాద్ కు చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు ఐడీసీ   మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహంకాల్ సుభాష్​​, ఇప్పేపల్లి సొసైటీ చైర్మన్ కిషన్ పవర్, జహీరాబాద్ కు చెందిన 7 మంది మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

అలాగే నారాయణఖేడ్ నుంచి నాగలిగిద్ద జడ్పీటీసీ రాజు రాథోడ్ బీజేపీలో  చేరగా, అదే మండలానికి చెందిన ఎంపీపీ మోతి బాయ్ కాంగ్రెస్ లో చేరారు. శంకరంపేట మండలం నుంచి నలుగురు ఎంపీటీసీలు, ముగ్గురు మాజీ సర్పంచులు    కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు.  తాజాగా సోమవారం జరాసంఘం జడ్పీటీసీ  నరేశ్​బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఎల్లారెడ్డి నుంచి మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు కాంగ్రెస్ లో చేరగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ కు చెందిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందూ ప్రియ కాంగ్రెస్ లో చేరారు..పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీలోకి వలసల జాతర ఎక్కువైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే గంగారం ఇటీవల బీజెపిలో చేరారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కలవరం

 బీఆర్​ఎస్​ నుంచి శ్రేణులు  కాంగ్రెస్, బీజేపీలోకి జంప్​ అవుతుండంతో ఆ పార్టీల్లో జోష్​ కనిపిస్తోంది.  దీంతో  ఆ పార్టీల అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.   వలసలను ఆపేందుకు   బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నించినా కార్యకర్తలు వినే పరిస్థితి లేదు.  మొన్నటివరకు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు మళ్లడంతో పరిస్థితులు తలకిందులవుతున్నాయి.  

గత స్థానిక సంస్థల్లో టికెట్లు ఇచ్చి కష్టపడి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఒక్కసారిగా ఇతర పార్టీలోకి వెళ్లడం.. పైగా వారిపైనే రాజకీయ విమర్శలు చేస్తుండడం తాజా మాజీలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జహీరాబాద్​   పార్లమెంట్​ నియోజకవర్గంలో కూడా బీఆర్​ఎస్​కు ప్రతికూల ప్రభావమే చూపుతున్నాయి.  ఎన్నికలు జోరందుకునే సమయానికి  ఇంకా ఎంత మంది బీఆర్​ఎస్​ను విడిచి వెళ్తారో అని  సీనియర్​ నాయకులు ఆందోళనలో పడుతున్నారు.