ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ​ఆశలు

ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ​ఆశలు
  • మెదక్‌‌పై హరీశ్‌‌రావు, కరీంనగర్‌‌పై కేటీఆర్ ఫోకస్
  • ఆయా నియోజకవర్గాల్లోనే తమ అసెంబ్లీ సెగ్మెంట్లు
  • పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్‌‌‌‌, మెదక్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థుల గెలుపును, ఆ పార్టీ ముఖ్య నాయకులిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరీంనగర్‌‌‌‌లో బోయిన్‌‌పల్లి వినోద్‌‌కుమార్‌‌‌‌ రావును గెలిపించడానికి కేటీఆర్‌‌, మెదక్‌‌లో వెంకట్రామిరెడ్డి విజయం కోసం హరీశ్‌‌రావు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు కావడంతో, ఇక్కడ పార్టీని గెలిపించుకోవడాన్ని ఇరువురు నేతలు చాలెంజ్​గా తీసుకొని, కష్టపడుతున్నారు. తామే ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 వ్యూహాలను రచించి అమలు చేయిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం కోసం చుట్టపు చూపుగా పోయొచ్చినా, ఎక్కువ సమయాన్ని తమ నియోజకవర్గాల్లోనే గడుపుతున్నారు. ముఖ్య నేతలిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తుండటంతో, కనీసం ఈ రెండు నియోజకవర్గాల్లోనైనా గెలుస్తామన్న ఆశాభావాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు.

సిరిసిల్లలో మెజార్టీ కోసం..

టీఆర్‌‌‌‌ఎస్‌‌ (బీఆర్‌‌‌‌ఎస్‌‌) ఆవిర్భావం నుంచి కరీంనగర్‌‌‌‌ ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచే 2004 ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. తెలంగాణ వచ్చాక జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున బరిలో నిలిచిన వినోద్‌‌ కుమార్ గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్‌‌‌‌ఎస్  గెలుచుకుంది. ఇలాంటి కరీంనగర్​లో‌‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్ వెనుకబడింది. ఏడు సీట్లలో మూడు మాత్రమే గెలుచుకోగలిగింది. మిగిలిన సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ త్రిముఖ పోరు నెలకొనగా, అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేస్తున్నారు.

 బీఆర్‌‌‌‌ఎస్ అభ్యర్థి వినోద్‌‌ కుమార్‌‌‌‌ను గెలిపించుకోవడానికి కేటీఆర్​ ప్రచార బాధ్యతలను  తన నెత్తికెత్తుకున్నారు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌‌.. బీజేపీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. మోదీ మేనియా, హిందుత్వ ఎజెండాతో సంజయ్‌‌ ముందుకెళ్తుండగా, అధికార పార్టీ అండతో వెలిచాల రాజేందర్‌‌‌‌రావు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్‌‌‌‌కు సుమారు 29,687 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్‌‌కుమార్ ఓటమికి, సిరిసిల్లలో మెజార్టీ తగ్గడమే కారణమని ఈటల రాజేందర్ వంటి నాయకులు విమర్శలు చేశారు. దీంతో ఈసారి కేటీఆర్ మరింత జాగ్రత్త పడుతున్నారు.

మెదక్​లో బలం నిలుపుకొనేందుకు..

మెదక్‌‌ నియోజకవర్గంలో బీఆర్‌‌ఎస్ గెలుపు హరీశ్‌‌రావుతో పాటు పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగానే మారింది. ఈ నియోజకవర్గంలోనే హరీశ్‌‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట, కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మెదక్‌‌.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ సిట్టింగ్ సీటు కూడా కావడం గమనార్హం. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌‌‌‌రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు.

 ఈయనకు మెదక్ రాజకీయాలతో సంబంధం లేకపోవడంతో, ఆయన గెలుపు బాధ్యతలను హరీశ్‌‌రావు భుజానికి ఎత్తుకున్నారు. సిద్దిపేటలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌‌ పార్లమెంట్‌‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్‌‌‌‌ఎస్ కైవసం చేసుకోవడం, ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఒక్క మెదక్ అసెంబ్లీని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. బీఆర్‌‌‌‌ఎస్‌కు ఇక్కడ సుమారు 2.48 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇలాంటి నియోజకవర్గంలో ఓడిపోతే ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక్కడ బీఆర్‌‌‌‌ఎస్‌‌కు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌‌ గట్టి పోటీనిస్తున్నారు. బీసీలు, ముదిరాజ్‌‌లు తనకు మద్దతుగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌‌రావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. మెదక్‌‌లో హరీశ్‌‌రావు కంటే తానే బలమైన నాయకుడిని అని, ఈసారి తన గెలుపు పక్కా అని రఘునందన్​రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.