దళితబంధు ఇప్పిస్తానని మోసం బీఆర్ఎస్ ​లీడర్ కారు గుంజుకెళ్లిన్రు!

దళితబంధు ఇప్పిస్తానని మోసం బీఆర్ఎస్ ​లీడర్ కారు గుంజుకెళ్లిన్రు!
  • రూ. లక్షల్లో అడ్వాన్సులు తీసుకుని బాండ్​ పేపర్​ రాసిచ్చిన నేత
  • లిస్ట్​లో పేరు రాకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలన్న బాధితులు 
  • తప్పించుకుంటుండడంతో కారు తీసుకుపోయిన్రు!
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఘటన 

భద్రాద్రికొత్తగూడెం/జూలూరుపాడు, వెలుగు : దళితబంధు స్కీం ఇప్పిస్తానంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన ఓ బీఆర్ఎస్​ లీడర్​ కొంతమంది నుంచి రూ. లక్షల్లో వసూలు చేశాడు. వారికి నమ్మకం కలిగించడానికి ఏకంగా బాండ్​పేపర్ ​కూడా రాసిచ్చాడు. అడ్వాన్సుగా రూ.లక్ష తీసుకుని మిగతా డబ్బులు స్కీం వచ్చాక ఇవ్వాలని కండీషన్ ​పెట్టాడు. చివరకు లిస్ట్​లో పేరు రాకపోవడంతో ఓ బాధితుడు వచ్చి ఆయన కారును లాక్కెళ్లాడు. దీంతో విషయం బయటకు వచ్చింది. జూలూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాగా నియోజకవర్గం మాత్రం ఖమ్మం జిల్లా వైరా పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా దేవీలాల్ ​బీఆర్ఎస్ ​నియోజకవర్గ స్థాయి నాయకుడిగా చలామణి అవుతున్నాడు. 

ఈయన రెండో విడత దళితబంధు పథకం ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో చాలామంది జనాలు ఈయనను తమకు స్కీం ఇప్పించాలని వేడుకున్నారు. అయితే, ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ. 2.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని, అడ్వాన్సు కింద రూ.లక్ష, రూ.2 లక్షలు ఇచ్చిన వారికి బాండ్​పేపర్ ​రాసిస్తానని హామీ ఇచ్చాడు. ఇది నమ్మిన కొంతమంది అడ్వాన్స్​కింద రూ.లక్షలు ముట్టజెప్పారు. వీరందరికీ ముందు చెప్పినట్టే బాండ్​పేపర్​కూడా రాసిచ్చాడు. 

ఒకవేళ స్కీం శాంక్షన్​కాకపోతే అడ్వాన్స్​ డబ్బులను వడ్డీ లేకుండా ఇస్తానని అందులో పేర్కొన్నాడు. ఇందులో కొంతమంది పేర్లు లిస్టులో రాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారు అగ్రిమెంట్ ​ప్రకారం తమ డబ్బులు ఇవ్వాలని కొద్ది రోజులుగా దేవీలాల్ ​వెంట పడుతున్నారు. దీనికి ఆయన ఎన్నికలు అయిపోయేంత వరకు ఆగాలని, లేకపోతే మీ ఇష్టమున్నట్టు చేసుకొమ్మని తేల్చిచెప్పాడు. దీంతో. విసుగు చెందిన కొందరు దరఖాస్తుదారులు దేవీలాల్ ​కారు లాక్కెళ్లారు. ఈ ప్రాంతంలో ఇలాగే స్కీంలు ఇప్పిస్తామని చెప్పి రూ.లక్షలు వసూలు చేసిన వారు  మరో నలుగురి వరకు ఉన్నారని, బాధితులు కూడా 
70 మంది వరకు ఉన్నారని తెలుస్తోంది. 

ALS0 READ: కన్ఫ్యూజ్​ చేస్తున్న ఎన్నికల సర్వేలు .. ఒక్కో సర్వే ఒక్కో లెక్క

రేపు మాపంటూ తిప్పుకుంటున్నడు

దళిత బంధు పథకం ఇప్పించినందుకు రూ. 2.30 లక్షలు ఇవ్వాలని దేవీలాల్​అడిగాడు. రూ. లక్ష అడ్వాన్స్​ ఇచ్చాను. బాండ్​పేపర్ ​కూడా రాసిచ్చాడు. నాతో పాటు చాలామంది డబ్బులిచ్చారు. లిస్టులో పేర్లు లేకపోవడంతో డబ్బులివ్వాలని అడుగుతుంటే తిప్పించుకుంటున్నాడు. దేవీలాల్​పై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. 
-జమలయ్య, వెంగన్నపాలెం