బీజేపీని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ వెనుకబడింది

బీజేపీని అడ్డుకోవడంలో  బీఆర్ఎస్ వెనుకబడింది

సత్తుపల్లి, వెలుగు : రాష్ట్రంలో బీజేపీని నిలువరించడంలో బీఆర్ఎస్ వెనుకబడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. సోమవారం సత్తుపల్లిలోని మల్లెపూల వెంకటేశ్వరరావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అన్ని శక్తులు ఏకం అవుతున్నాయని, వారితో సీఎం కేసీఆర్ కలిసి రావాలని కోరారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్న మోడీని గద్దె దించడమే సీపీఐ లక్ష్యమని చెప్పారు. దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై బీజేపీ లీడర్ లా వ్యవహరిస్తున్నారని, ప్రజా దర్బార్లు పెడుతూ తన పరిధికి మించి పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ పాలకులు వదిలి వెళ్లిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఏపీ ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెల్సన్ రామారావు, ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, మండల కార్యదర్శి యోబు పాల్గొన్నారు.