ఓల్డ్​ సిటీలో బీఆర్ఎస్​ ఖాళీ!

ఓల్డ్​ సిటీలో బీఆర్ఎస్​ ఖాళీ!
  •      అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత క్యాడర్​ సైలెంట్
  •     ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న ముఖ్య నేతలు 
  •     అత్యధిక ఓట్​బ్యాంక్​ఉన్న గోషామహల్​లోనూ ఇదే పరిస్థితి 
  •     లోక్​సభ ఎన్నికల్లో ఓట్లు భారీగా తగ్గుతాయని అంచనా

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్​సిటీలో బీఆర్ఎస్​పార్టీ ఖాళీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ క్యాడర్​పూర్తిగా సైలెంట్ అయింది. హైదరాబాద్​లోక్​సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ లో, మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. గడిచిన పదేండ్లలో స్థానిక నేతలు గెలిచినా, ఓడినా పార్టీ అధికారంలో ఉండడంతో ఫుల్​జోష్​తో కనిపించిన బీఆర్ఎస్​కింది స్థాయి నేతలు, ముఖ్య కార్యకర్తలు ఇండ్లకే పరిమితం అయ్యారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గోషామహల్​లో బీఆర్ఎస్​కు 58 వేల ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందకిషోర్ వ్యాస్ గెలుపు అంచుల దాకా వెళ్లారు. కాగా, ఆయన నెల కింద బీఆర్ఎస్ కు గుడ్​బై చెప్పి కాంగ్రెస్​లో చేరారు. గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ సింగ్ రాథోడ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. స్థానికంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో క్యాడర్ సైలెంట్​అయింది. ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా నామినేషన్లు, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే బీఆర్ఎస్ వర్గం ఎక్కడా కనిపించడం లేదు. 

గోషామహల్​లో ఢీలా..

హైదరాబాద్ లోక్​సభ స్థానం పరిధిలో మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూరా, యాకుత్​పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలోని గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బలమైన ఓట్​బ్యాంక్​ఉంది. ఆ తర్వాతి స్థానంలో కార్వాన్, బహదూర్ పురా ఉన్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సేమ్​సీన్​రిపీట్ అయింది.

అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ యాక్టీవ్​గా లేదు. క్యాడర్​గప్​చుప్​అన్నట్లుగా ఉంది. గోషామహల్ మాదిరిగానే మిగిలిన నియోజకవర్గాల్లోని మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి లీడర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్​ గూటికి చేరారు. ముఖ్యనేతలు పార్టీ మారడంతో ఈసారి ఆ పార్టీకి ఓట్లు తగ్గుతాయని తెలుస్తోంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో హైదరాబాద్​పరిధిలో ఎంఐఎంకు 5,17,471 ఓట్లు రాగా, బీజేపీకి 2,35,285 ఓట్లు వచ్చాయి. మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కు 63,239 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019లో వచ్చినన్ని ఓట్లు కూడా రావని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా68 వేల ఓట్లు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓల్డ్​సిటీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో ఎంఐఎంకు 55,805 ఓట్లు రాగా, బీజేపీకి 23,731, కాంగ్రెస్​కు 29,699, బీఆర్ఎస్​ కు 15,516 ఓట్లు వచ్చాయి. కార్వాన్ లో ఎంఐఎంకు  83,388, బీజేపీకి 41,402, కాంగ్రెస్ కు 18,160 ఓట్లు రాగా, బీఆర్ఎస్​కు 29,194 ఓట్లు పడ్డాయి. గోషామహల్ లో  బీజేపీకి 80,182 ఓట్లు రాగా, కాంగ్రెస్​ కు కేవలం 6,265 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్​58,725 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. చార్మినార్​లో ఎంఐఎంకు 49,103, బీజేపీకి 26,250, కాంగ్రెస్ కు​10,899, బీఆర్ఎస్​కు 8,874 ఓట్లు పడ్డాయి.

చాంద్రాయణగుట్టలో ఎంఐఎంకు 99,776 ఓట్లు రాగా, బీజేపీకి 16,414, కాంగ్రెస్ కు  14,589, బీఆర్ఎస్​కు 18,116 ఓట్లు వచ్చాయి. బహదూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురాలో ఎంఐఎంకు 89,451, బీజేపీకి 11,621, కాంగ్రెస్​కు14,448, బీఆర్ఎస్ కు 22,426 ఓట్లు పోల్ అయ్యాయి.  ఇక యాకుత్ పురాలో ఎంఐఎంకు 46,153, ఎంబీటీకి 45,275, బీజేపీకి 22,354 ఓట్లు పడగా, కాంగ్రెస్ కు 6,954, బీఆర్ఎస్​కు 15,516 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్​లోక్​సభ స్థానంలో పోలైన ఓట్లను కలిపి చూస్తే ఎంఐఎంకు 4,23,676 ఓట్లు, బీజేపీకి 2,21,954,  కాంగ్రెస్ కు 1,01,014 ఓట్లు, బీఆర్ఎస్​ కు 1,68,367 ఓట్లు వచ్చాయి. మరి ఈసారి బీఆర్ఎస్​ ఓట్లు ఎవరికి ప్లస్​ అవుతాయో చూడాలి.