జూబ్లీ గెలుపు.. రేవంత్ మార్క్

జూబ్లీ గెలుపు.. రేవంత్ మార్క్

జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీకి గొప్పబలాన్ని తెచ్చి పెట్టింది. వాస్తవం చెప్పాలంటే ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయంగానే చెప్పుకోవాలి. 2009లో విష్ణువర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఈ నియోజవకర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే సాధ్యమయింది. 

2014వ  సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించగా, ఆయనే 2018లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా, 2023లో  బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి  అజారుద్దీన్​ పై 16,337 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 

2018 ఎన్నికల్లో కూడా గోపీనాథ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎఐఎంఐఎం అభ్యర్థి  నవీన్ యాదవ్​పై  9,242 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 

ఈ ఉప ఎన్నికను  కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  మాగంటి గోపీనాథ్   ఆయన భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ రంగంలోకి దించింది.  సెంటిమెంట్​గా ఈ స్థానాన్ని గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ సెంటిమెంట్​ పనిచేయలేదు.

నవీన్​ యాదవ్ ఎంపిక పనిచేసింది

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలు రిజర్వేషన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో  కాంగ్రెస్​  పార్టీకి  జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక  ఒక  అవకాశంగా  లభించింది.   బీసీకి చెందిన  నవీన్ యాదవ్​ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడం కాంగ్రెస్​కు కలిసివచ్చింది. 

2025లో కాంగ్రెస్ పార్టీ  బీసీ కార్డును ఉపయోగించింది. బీసీకి చెందిన నవీన్ యాదవ్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.  నియోజకవర్గంలోని  బోరబండ, ఎర్రగడ్డ,  యూసఫ్ గూడ, షేక్ పేట్,  రహ్మత్ నగర్ తదితర ప్రాంతాల్లో బీసీల ఓటర్లు 90 వేలకుపైగా ఉన్నారు. ముస్లిం ఓటర్లు 1,12,000 వరకూ ఉన్నారు.  అంటే,  మొత్తం ఓటర్లలో (3,99,000) దాదాపు 60 శాతం ఓటర్లు బీసీలు, ముస్లిం మైనారిటీలే కావడం గమనార్హం.  బీసీల ఓట్లు రాబట్టుకునేందుకు బీసీ కార్డు ఉపయోగపడుతుందని భావించారు. 

నవీన్​యాదవ్​ను వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన రేవంత్​రెడ్డికి ఈ క్రెడిట్​ దక్కుతుంది. 2025 ఉప ఎన్నికల్లో ఎంఐఎం  పోటీ చేయలేదు. కాంగ్రెస్​కు మద్దతు ఇచ్చింది.  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం నేతలు ప్రచారం చేశారు.  గత ఎన్నికల్లో 64,212 ఓట్లు (35.03 శాతం) సంపాదించి అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇవ్వడంతో  1,12,000 ఓట్లున్న ముస్లిం మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్​కు సానుకూలత వ్యక్తం చేశారని స్పష్టమవుతోంది.  సీపీఐతో పాటు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాయి. 

కుటుంబ కలహాలు

బీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన మాగంటి సునీతకు కుటుంబ కలహాలు కూడా ఇబ్బంది కలిగించాయి.  గోపీనాథ్  మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి  స్వయంగా వెల్లడించారు. గోపీనాథ్ మొదటి భార్య, కొడుకులతో కలిసి గోపీనాథ్ తల్లి మీడియా ముందుకువచ్చి అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలని   గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. సరిగ్గా పోలింగ్ ముందే ఈ అంశాలు వెల్లడి కావడంలో మాగంటి సునీతకు లభిస్తుందని భావించిన ‘సానుభూతి’  పెద్దగా పనిచేయలేదు.

మంత్రుల కృషి పనిచేసింది

నవీన్ యాదవ్ విజయం సాధించేందుకు   రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి పనిచేసింది.    గత ఐదు నెలల నుండి వివేక్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి  ప్రచారం చేసారు.  ముస్లిం మైనారిటీల ఓట్లు రాబట్టుకునేందుకు వివేక్ రూపొందించి  అమలుచేసిన ప్రణాళిక సత్ఫలితాలు ఇచ్చింది.  

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,  రాష్ట్ర మంత్రులు  పొన్నం ప్రభాకర్,  పార్లమెంటు సభ్యుడు  మల్లు రవి తదితరులు వివేక్​కు పూర్తిగా  సహకరించారు. నియోజకవర్గంలోని గల్లీగల్లీలో వివేక్ తిరిగారు.  బీఆర్ఎస్ హయాంలో గత 10 సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన అంశాలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. 

రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలపై  దృష్టిపెట్టారు.  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. దాదాపు 200 కోట్ల రూపాయలు వివిధ పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసే విధంగా పావులు కదిపారు. 

నిధులువిడుదల చేయించటమే కాకుండా పనులు ప్రారంభించి కొనసాగించారు. చాలా పనులు పూర్తి కూడా చేసారు. ఓటర్లలో భరోసా కల్పించారు. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా మీ వెంటే ఉంటాం అంటూ నమ్మకం కలిగించారు.

స్థానిక ఎన్నికలకు ఊతం

 2009లో  జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 2014, 2018, 2023లలో  ఓటమి చవిచూసి 2025లో  తిరిగి  విజయబావుటా ఎగరవేసింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూర్చాయి.  ఈ విజయం భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ఊతం ఇచ్చేవిధంగా ఉన్నది. ముఖ్యమంత్రిగా ఇది  రేవంత్​ రెడ్డి గెలుపే!

- పి.వి. రమణారావు,  సీనియర్ జర్నలిస్ట్​