వాయు కాలుష్య కట్టడి ఎలా?

వాయు కాలుష్య కట్టడి ఎలా?

ఢి ల్లీ ప్రజలు 9 నవంబర్ 2025న ఇండియా గేట్ వద్ద  ‘క్లీన్ ఎయిర్’ కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు.   ప్రతి సంవత్సరం  ఢిల్లీ నగరం శీతాకాలంలో  వాయు కాలుష్యంతో  ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.  ప్రతి శీతాకాలంలో నగరంపై  దట్టమైన,  విషపూరితమైన పొగమంచు కమ్ముకుంటుంది. అదేవిధంగా ఢిల్లీవాసుల కళ్లు, గొంతు మండటం జరుగుతోంది. గాలి నాణ్యత  ప్రజలను  భయాందోళనకు గురి చేస్తున్నది.  ఢిల్లీ  గాలి కాలుష్యానికి  అనేక కారణాలు ఉన్నాయి. 

పం జాబ్,  హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి  రాష్ట్రాలలో  వ్యవసాయ పంట అవశేషాలను తగలబెట్టడం,  దీపావళి  పండుగనాడు  బాణసంచా కాల్చడం,  మరోవైపు వాహనాల ఉద్గారాలు పెరగడం వల్ల  వాయు కాలుష్యం పెరిగిపోతోంది.  శీతాకాలంలో  దట్టమయిన మంచుతో  కాలుష్యం కలవటం వలన పొగమంచు ఏర్పడుతుంది.  దీనినే  ‘స్మోగ్’  అని అంటారు.  పొగమంచు దృశ్యమానతను తగ్గిస్తుంది.  దీనివలన విమాన,  రైలు, రోడ్లు వంటి  రవాణా  వ్యవస్థలకు  తీవ్ర అంతరాయం కలుగుతుంది.  ఈ కారణంగా  రోడ్లు,  రైలు, విమాన ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలావరకు ఉన్నాయి. 

దీపావళి తర్వాత ఢిల్లీ నగరంలో గాలి కాలుష్యం నుండి  ఉపశమనం కలిగించడానికి అక్టోబర్ 28, 2025 న ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ- కాన్పూర్  సహకారంతో  క్లౌడ్-సీడింగ్ నిర్వహించింది.  కానీ,  క్లౌడ్-సీడింగ్ విజయవంతం కాలేదు.  క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమంగా వర్షాన్ని సృష్టించడం.  దీపావళి  పండుగకు  కొన్ని రోజుల ముందు,  ఢిల్లీ  పరిసర ప్రాంతాలలో  బాణసంచా అమ్మకం,  పేల్చడంపై ఐదు సంవత్సరాల నిషేధాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సడలించింది.  తక్కువ కాలుష్య కారక ‘గ్రీన్ క్రాకర్స్’ వాడకాన్ని అనుమతించింది.  గ్రీన్ క్రాకర్స్ 20 నుండి 30% మాత్రమే  కాలుష్యాన్ని కలుగజేస్తాయి.  అయితే,  అవికూడా  గాలి నాణ్యతను దిగజార్చే హానికరమైన కణాలను విడుదల చేస్తాయని నిపుణులు చెపుతున్నారు.

వాయు కాలుష్యం అంటే ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  ప్రకారం వాయు కాలుష్యం అంటే వాతావరణం సహజ లక్షణాలను మార్చివేసే  ఏదైనా రసాయన,  భౌతిక లేదా జీవసంబంధమైన ఏజెంట్ అంతర్గత (ఇండోర్) లేదా బాహ్య (అవుట్ డోర్) వాతావరణాన్ని కలుషితం చేయడం.  ప్రపంచ జనాభాలో ఎక్కువశాతం ప్రజలు డబ్ల్యూ.హెచ్.ఓ  మార్గదర్శక పరిమితులను మించిన కాలుష్య కారకాలు కలిగిన గాలిని పీల్చుకుంటున్నారని,   దిగువ,  మధ్య-ఆదాయ దేశాలు అత్యధికంగా  వాయు కాలుష్యానికి గురి అవుతున్నాయని అని  డబ్ల్యూ.హెచ్.ఓ. డేటా తెలియచేస్తున్నది.

వాయు కాలుష్యంలో ఢిల్లీకి రెండో స్థానం

గాలి నాణ్యత స్థాయి 0-–50 మంచిది,  51-– 100 మితమైనది, 101–-200 పేలవమైనది,  201–-300 అనారోగ్యకరం. 301-– 400 తీవ్రమైనది,  401-– 500 ఆ పైన  ప్రమాదకరమైనది.  ఢిల్లీలో  గత కొన్ని రోజులుగా సగటు  గాలి నాణ్యత 323తో  తీవ్రస్థాయికి చేరుకుంది.  హైదరాబాద్‌‌లో  సగటు  గాలి నాణ్యత  111తో  పేలవమైన గాలి నాణ్యతను కలిగి ఉంది.  ఈ నాణ్యత ప్రతిరోజూ మారుతుంది.  ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారతదేశంలోనే  ఉన్నాయి.  అత్యంత  కాలుష్య  రాజధాని ఢిల్లీ. 

  ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం వలన పీల్చేప్రాణవాయువు నాణ్యత లోపించింది.  వాయు కాలుష్యం వివిధ పట్టణాలలో సర్వ సాధారణ విషయంగా మారిపోయినది.  దీనివలన మరణాల రేటు పెరగటంతోపాటుగా  వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి.   నవంబర్ 13, 2024 నాటికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్  విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత కలుషితమైన  టాప్  10 నగరాలలో  ఢిల్లీ,  హాజీపూర్,  భివానీ  మొదటి మూడు  స్థానాలను ఆక్రమించాయి.  

స్విస్ దేశానికి చెందిన  'ఐ.క్యూ.ఎయిర్ కంపెనీ’   ప్రకారం నవంబర్ 7, 2024 నాటికి వాయు కాలుష్యంలో ఢిల్లీ ప్రపంచంలోనే  రెండో స్థానంలో ఉంది.  లాహోర్  మొదటి  స్థానంలో ఉంది.  భారతదేశం ప్రస్తుతం తీవ్ర వాయు కాలుష్యంతో పోరాడుతోంది.  మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో అత్యంత కలుషితమైన దేశం.  ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం దేశంలో వార్షిక సగటు  పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5 సాంద్రతలు 53.3 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్  మీటర్  నుంచి 54.4 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్  మీటరుకి పెరిగాయి.

‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌‌' పరిశోధన అంశాలు 

2008–2019 మధ్య ఢిల్లీ,  బెంగళూరు, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, కోల్‌‌కతా, పూణే, వారణాసి,  సిమ్లా వంటి  పది భారతీయ నగరాల్లో  నమోదైన సుమారు 3.6 మిలియన్ల మరణాల డేటాను అధ్యయనం చేసి,  పరిశోధన ఫలితాలను  ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌‌'  ప్రచురించింది. ఈ అధ్యయనం భారతదేశం  ప్రస్తుత గాలి నాణ్యత ప్రమాణాలను తెలియజేస్తున్నది.  ఈ  అధ్యయనం ప్రకారం గాలిలోనికి  24 గంటల వ్యవధిలో పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5,  క్యూబిక్ మీటరుకు 60 మైక్రోగ్రాముల వరకు విడుదల అవుతున్నది.  

ఇది  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన  క్యూబిక్ మీటర్‌‌కు 15 మైక్రోగ్రాముల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.  పార్టిక్యూలేట్ మ్యాటర్ 2.5, అనగా   గాలిలో 2.5 మైక్రాన్లు  లేదా అంతకంటే తక్కువ  వెడల్పు ఉన్న చిన్న చిన్నకాలుష్య  కణాలు. 

వాయుకాలుష్యంతో భారీసంఖ్యలో మరణాలు

బ్రిటిష్  మెడికల్ జర్నల్ (బి.ఎం.జె)లో  ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కారణంగా భారతదేశంలో సంవత్సరానికి 2.18 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి.  పరిశ్రమలలో, విద్యుత్ ఉత్పత్తి,  రవాణాలో  శిలాజ ఇంధనాలను ఉపయోగించడంవల్ల వచ్చే వాయు కాలుష్యం  ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5.1 మిలియన్ల అదనపు మరణాలకు కారణమవుతోందని పరిశోధనలో వెల్లడైంది.  వాయు కాలుష్యాన్ని నివారించాలి అంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, ‘సోలార్ విద్యుత్’ వంటి  పునరుత్పాదక ఇంధనాల వాడకాన్ని పెంచాలి.  

ఈక్రమంలో భారత ప్రభుత్వం ‘జీవ ఇంధనాలపై జాతీయ విధానం’ ద్వారా పర్యావరణ అనుకూల  ఇథనాల్  బ్లెండెడ్ పెట్రోల్ (ఇ-20 పెట్రోల్)  కార్యక్రమానికి  రూపకల్పన చేసింది.   హరిత హైడ్రోజన్ ఉత్పత్తి,  వినియోగం, ఎగుమతి కోసం ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ ను  ప్రారంభించింది.  బాటరీలతో  నడిచే విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది.  

కాలుష్య నివారణలో ప్రజల పాత్ర కీలకం

కాలుష్య నివారణలో ప్రజల  సహకారం ఎంతో అవసరం.  కావున  ప్రజలు స్వచ్ఛందంగా సైకిల్ వంటి వాహల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలి.  కాలుష్యాన్ని నివారించడానికి అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయలేకపోతున్నాయి.  ఉత్సవాలను  జరిపిన  తర్వాత  ప్లాస్టర్  ఆఫ్  పారిస్  విగ్రహాలను  నీటిలో  నిమజ్జనం చేయడంవలన జల కాలుష్యం ఏర్పడుతున్నది.   

గత  సంవత్సరం  తెలంగాణ ప్రభుత్వం డీజే సౌండ్,  ధ్వని కాలుష్యం  నియంత్రణ కోసం  మార్గదర్శకాలను  రూపొందించినప్పటికీ  అమలుచేయడానికి ప్రజలు సహకరించటం లేదు. ఇలా ప్రజల సహకారం లేనప్పుడు  ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు.  

అంటే ప్రజల సహకారంతోనే  ఎటువంటి కాలుష్యాన్ని అయినా కట్టడి చేయగలం. పరిస్థితులు విషమించిన తర్వాత నిరసన ప్రదర్శనలు చేయడం వలన లాభం ఉండదు.  ఎందుకంటే కాలుష్యం బారిన పడిన తర్వాత తిరిగి  పూర్వ పరిస్థితిని తీసుకొని రావటం అంత సులువు కాదు.  కాబట్టి  ప్రజలు బాధ్యతతో ప్రభుత్వాలకు సహకరించాలి.  


-

డా. శ్రీధరాల రాము,  ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్