స్వరం మార్చిన కవిత.. రూటు మారనుందా?

స్వరం మార్చిన కవిత.. రూటు మారనుందా?

తెలంగాణ జాగృతి నేత కల్వకుంట కవిత స్వరం అప్పుడప్పుడు విచిత్రంగా వినిపిస్తుంది. ఒకోసారి ఆ మాటలకు ఆమెకు అన్వయం కుదరట్లేదనిపించి, సదరు మాటలన్నది ఆమేనా? అని మనను మనం గిల్లి చూసుకోవాల్సి వస్తుంది! ‘భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం తప్ప సామాజిక తెలంగాణ రానేలేదు, దానికోసం మరో పోరాటం చేయాల్సిందే’ అని ఆమె అన్నట్టు రావడం ఇటువంటిదే!  

ఆమె ఇపుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరఫున శాసనమండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు.  మాజీ  సీఎం కే.చంద్రశేఖరరావుకి కూతురు.  పదేళ్లు తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు మిన్నకున్న ఆమె... మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం పెట్టి తీరాల్సిందేని తాజాగా పట్టుబట్టడం కూడా అలాగే ధ్వనిస్తుంది. ‘ఇటువంటి’ ఆమె క్రియాశీలకం..తండ్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అభీష్టానికి వ్యతిరేకమని కుటుంబ సన్నిహితులే చెబుతారు. ఇంతకీ ఆమె రాజకీయ ఆలోచనల సారమేమిటి?  బెట్టుతో ఏదో సాధించడమా? వేరు కుంపటా?


‘కాసుకో  కాసుకో రాజకీయమా!  ప్రజలు పనస తొనలు.. మీరు కత్తిమొనలు’  అంటాడు అలిశెట్టి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌.  కేసీఆర్ ​కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువుల్లో పలువురు రాజకీయాల్లో కత్తిమొనలవంటి వారేననేది జనాభిప్రాయం. కేసీఆర్‌‌‌‌‌‌‌‌  రాజకీయ వారసత్వం విషయమై ఆయన తనయుడు కేటీఆర్‌‌‌‌‌‌‌‌, మేనల్లుడు టి.హరీష్‌‌‌‌‌‌‌‌రావు మధ్య ఓ స్పర్ధ  లోలోపల రగులుతూనే ఉంటుంది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తనయ కవిత ఎప్పుడూ తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నాల్లో ఉంటారు. 

తెలంగాణ సాధన ఉద్యమకాలం నుంచి కూడా కవిత వాగ్ధాటి,  ధైర్యసాహసాలున్న మహిళ.  తెలంగాణతనం ఉట్టిపడే పలు  కళా, సాంస్కృతిక కార్యక్రమాలకు ‘జాగృతి’ వేదికగా ఆమె నేతృత్వం వహించారు. దేశ, విదేశాల్లో  మన బతుకమ్మ పండుగను  ప్రచారంలోకి  తీసుకురావడంలో కొంత ఆమె కృషి కూడా ఉంది.  నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంపీగా లోగడ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.  దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌’ కేసులో కీలక నిందితురాలిగా అరెస్టయి  ప్రస్తుతం బెయిల్‌‌‌‌‌‌‌‌పై ఉన్నారు.  

బెట్టు చేస్తున్నదా? ​ప్రాధాన్యత​ పెంచుకోవడానికా?

వివిధ  ప్రజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆమె పాల్గొంటున్నారు.  తెలంగాణ తల్లి విగ్రహం, బీసీల సామాజిక న్యాయం, కృష్ణా జలవివాదాలు,  ఫూలే విగ్రహం ఏర్పాటు తదితర విషయాల్లో ఆమె చురుకుగా ఉంటూ  పలు  రాజకీయ ప్రకటనలు చేశారు.  చాలావరకు వీటికి పార్టీ శ్రేణులు దూరంగానే ఉంటున్నాయి.  ఇపుడు ఏకంగా సామాజిక  తెలంగాణ ఏర్పడనేలేదని,  అందుకోసం మరో పోరాటం అవసరమనే భావనను కవిత వ్యక్తం చేసినట్టు మీడియా కథనాలు రావటం పలువురిని ఆశ్చర్యపరచింది.  

దీన్ని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంగీకరిస్తారా?  రాష్ట్రం తెచ్చుకొని,  పదేళ్లు పాలనలో ఉండి ఎందుకు ఏర్పరచలేదు,  పోనీ ఎందుకు ఆ సమయంలో కనీసం గొంతెత్తలేదు?  అనే  ప్రశ్న జనంలో సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు మింగుడుపడని పరిణామాలే! తెలిసీ ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఏదో బెట్టు చేసి పార్టీలోనే తాను కోరుకునేది సాధించడమా? అవసరమైతే పార్టీ నుంచి వేర్పడి విడిగా తన రాజకీయ ప్రాధాన్యత పెంచుకోవడమా? అనే దిశలో కవిత ఆలోచిస్తున్నట్టు ఆమెను సన్నిహితంగా ఎరిగిన వారి అంచనా!

వారసులే పీఠాలెక్కారు

తొలి ప్రధాని నెహ్రూకు తనయులు లేక తనయ ఇందిర  వారసురాలయ్యారు.  సోనియాగాంధీకి  విదేశీ మూలాలున్నా... భారతీయ సంప్రదాయ పంథాలోనే  రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీకే  తప్ప ప్రియాంకా గాంధీకి తొలి ప్రాధాన్యత ఇవ్వలేదు. తమిళనాట కరుణానిధి తనయ కనుమొళిలో  చైతన్యం వెల్లి
విరిసినా.. తనయుడు స్టాలిన్‌‌‌‌‌‌‌‌ వారసుడిగా పీఠమెక్కారు.  

మహారాష్ట్ర రాజకీయాల్లో ఇరువైపులా అలాగే జరిగింది.  రాజ్‌‌‌‌‌‌‌‌థాక్రే ఎంత సమర్థంగా వ్యవస్థల్ని నడపగలిగినా బాల్‌‌‌‌‌‌‌‌థాక్రే వారసత్వం, ఆయన తనయుడు ఉద్దవ్‌‌‌‌‌‌‌‌ థాక్రేకే  దక్కింది. శరద్‌‌‌‌‌‌‌‌పవార్‌‌‌‌‌‌‌‌  తనయ సుప్రియా సూలే రాజకీయ పరిణతి, ప్రజాదరణతో నిమిత్తం లేకుండా పవార్‌‌‌‌‌‌‌‌ అన్న కొడుకైన అజిత్‌‌‌‌‌‌‌‌పవార్‌‌‌‌‌‌‌‌  తెరకెక్కారు. డా.వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖరరెడ్డి సంతానం విషయంలోనూ అదే జరిగింది. 

మన పురుషాధిక్య సమాజపు పరిణామ క్రమమిది. ఉత్తర్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ములాయంసింగ్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ సోదరుడు శివపాల్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌  నిర్వహణా సామర్థ్యం, రాజకీయ చతురత పక్కన పెట్టి తనయుడు అఖిలేష్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌కే  అందలాలు ఇవ్వాల్సిన వాతావరణం వచ్చిందా? ములాయం కల్పించారా? సరైన చరిత్ర అధ్యయనమే చెప్పగలదు. ఎన్టీఆర్​ వారసత్వం విషయంలో.. ఆయనకు తనయులున్నా, వారే స్వయంగా బావకు మద్దతుగా నిలవటం,  ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు అల్లుడైన చంద్రబాబు నాయుడు ఎత్తులు -జిత్తులతో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో సంప్రదాయానికి అక్కడ బ్రేకు పడింది.

సొంత జనం, నియోజకవర్గం లేకుండా..

తండ్రి కేసీఆర్​ను విభేదించి రాజకీయ మనుగడ సాధించడం కవితకు  కష్టమైన పనే!  ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి,  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  సిద్దిపేట నుంచి ఎన్నో పోరాటాలు, రాజకీయ డక్కామొక్కీలు తిన్న తర్వాత  స్థిరపడ్డ నాయకుడు. 2004 తర్వాత హరీష్‌‌‌‌‌‌‌‌ అయినా అంతే,  శాయశక్తులా కృషితో  సిద్దిపేటను  అభివృద్దిపథంలో నడిపి,  తన నియోజకవర్గంగా రాజకీయ ఉనికిని అక్కడ స్థిరపరుచుకున్నారు. 

తన అత్తగారి ఊరుందని నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆశీస్సులతో గెలిచిన కవితి ‘ఓకేసారి ఎంపీ’గా మిగిలిపోయారు. తాను సిటింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీ (2014-–19)గా, పార్టీ అధికారంలో ఉండి, ముఖ్యమంత్రి తనయగా పలుకుబడి కలిగి 2019 ఎన్నికల్లో  అరవింద్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయారు.  తనకంటూ స్థిరపరుచుకున్న అసెంబ్లీ స్థానం కూడా లేదు, ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

ఎటు ప్రయాణం?

మెట్టినింటి నుంచి రాజకీయంతో  ఎంపీగా పార్లమెంటుకెదిగి, అదే వేదికగా గట్టి  స్వరం వినిపించిన కవిత,  ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌ కేసుతో అప్రతిష్ట 
మూటగట్టుకున్నారు. ఆ కేసు ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా తన ప్రస్తానాన్ని ఎటు సాగిస్తారు?  రాజకీయంగా తాను కోరుకునే స్థానాన్ని సాధిస్తారా? బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో  వేరుపడి,  జాగృతి  సాంస్కృతిక వేదికను రాజకీయ పార్టీగా మలుస్తారా? ఇవీ, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న గుసగుసలు.  త్వరలోనే  ఆమె ఒక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంపై  ప్రజావ్యతిరేకత వేగంగా పెరుగుతోందని బలంగా విశ్వసిస్తున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, తదుపరి అవకాశాలు తమవే అని తలపోస్తోంది. ఈ పరిస్థితుల్లో కవిత చర్యలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయన్నది ప్రశ్న!  రాజకీయంగా గట్టి భూమిక లేకుండా ఎన్జీవో  స్థితి నుంచి రాజకీయంగా ఎదగడం కష్టమని తెలుగునాట ‘లోక్‌‌‌‌‌‌‌‌సత్తా’ వంటివి ఇదివరకే రుజువు చేశాయి. 

‘సామాజిక తెలంగాణ’ అంశం ‘తెలంగాణ’ పుట్టించినంత వేడినివ్వగలదా?  ఇంద్రారెడ్డి,  ఇన్నయ్యల నుంచి  దేవేందర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, కోదండరామ్‌‌‌‌‌‌‌‌ వరకు చాలామంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినా గొప్పగా క్లిక్‌‌‌‌‌‌‌‌ అయిన చరిత్ర లేదు.  తెలంగాణనే  కేంద్రబిందువు చేసి 2001లో  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పార్టీని స్థాపించిన నుంచి పుష్కర కాలానికిపైన నిరవధికంగా ఉద్యమం కొనసాగిస్తూనే 2004, 2009 సాధారణ ఎన్నికలు పలు ఉప ఎన్నికల్లో  ఎన్నో ఎత్తుగడలు, -జిమ్మిక్కులు,  పొత్తులు, పోరాటాలు చేస్తేగాని నిలబడలేకపోయారు. 

ఆ నిలకడ ఫలితంగానే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిపోరుతోనే తెలంగాణ రాష్ట్ర సమితికి విజయాలు దక్కాయి.  ఇప్పుడు సొంతంగా వేరు కుంపటి పెట్టి కవిత నిలదొక్కుకోగలరా?  వై.ఎస్‌‌‌‌‌‌‌‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి భంగపోయిన అనుభవం కవితకేమైనా పాఠమయ్యేనా?  ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే! మళ్లీ అలిశెట్టి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ కవితా ఖండికనొకదాన్ని గుర్తు చేసుకుందాం. ‘ప్రసవ వేదన గదుల్లోంచి/ గావు కేక... / చావు కేక../  తల్లీ!/ బిగపట్టిన నీ శ్వాస నుంచి/ ఊపిరెవరు../ పాపలెవరు’.

వారసత్వం కష్టమే!

కవిత ఎంత క్రియాశీలకంగా ఉన్నా  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  రాజకీయ వారసత్వం ఆమెకు లభించడం అంత తేలిక కాదు.  ఇదే విషయంలో తనయుడు  కేటీఆర్‌‌‌‌‌‌‌‌  ముఖ్య హక్కుదారుడిగా పలు వ్యూహాలు రచిస్తూ ముందున్నారు. బహుళ ప్రజాదరణ ఉండీ హరీష్‌‌‌‌‌‌‌‌రావు మింగలేక- కక్కలేక అనే పరిస్థితిలో వీటన్నిటినీ గమనిస్తూ, భరిస్తూ కొనసాగుతున్నారు. 

వరంగల్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల పార్టీ స్వర్ణోత్సవ సభ సందర్భంగా వెలసిన పోస్టర్లు, హోర్డింగ్స్‌‌‌‌‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌,  కేటీఆర్‌‌‌‌‌‌‌‌  తప్ప మరొకరి ఫొటో లేకుండా చూసుకోవడం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అనుమతితోనే జరిగి ఉంటుందని అందరిలాగే హరీష్‌‌‌‌‌‌‌‌రావు,  కవిత కూడా భావించి ఉంటారు.  వారసత్వ రాజకీయాలను ప్రజలెంత ఈసడించుకున్నా.. అక్కడక్కడా తప్పట్లేదు.  దేశవ్యాప్త రాజకీయాల్లో  ఎక్కడ, ఎప్పుడు చూసినా..ఇతరుల కన్నా బంధువర్గం -కుటుంబ సభ్యులు, అందులోనూ స్వీయ సంతానం, వారిలోనూ కూతుళ్ల కన్నా తనయులే అగ్రతాంబూలం పొందుతున్నారు.

- ఆర్. దిలీప్ రెడ్డి,సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌