
జడ్చర్ల, వెలుగు: జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆవరణలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గా ర్డెన్ లో అరుదైన మొక్కలు, అందమైన పూలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అడవుల నుంచి సేకరించిన మొక్కలు పువ్వులు పూస్తున్నాయి. ఆర్కిడ్ జాతులైన హాబినేరియా ఫర్సిఫెర, హాబినేరియా డిజిటేట, జియోడోరం డెన్సిఫ్లోరం, జియోడోరమ్ లాక్సిఫ్లోరమ్, యూలోఫియా గ్రమీనియా, లూసియా జైలానిక, వాండ టెస్టేసియా పూలు ఇటీవల వికసించాయి.
వీటితో పాటు 12 జాతుల ఇతర ఆర్కిడ్ మొక్కలున్నాయి. హెటెరోస్టెమ్మ బెడ్డోమి అనే తీగ జాతి మొక్కను 160 ఏండ్ల తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో సదాశివయ్య, ప్రసాద్(శ్రీ వేంకటేశ్వర కాలేజీ, న్యూ ఢిల్లీ) కనుగొన్నారు. దీనిని కేరళ ప్రాంతంలో 1862లో గుర్తించారు. దీనికి సంబంధించిన హైర్బేరియం(మొక్క నమూనా) కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. దీనిని ఇప్పుడు కాలేజీలోని తెలంగాణ స్టేట్ హెర్బేరియంలో భద్రపరిచారు.
ఈ మొక్క ఇప్పుడు బొటానికల్ గార్డెన్ లో వికసించింది. ఇలాంటి అరుదైన మొక్కలెన్నో ఈ గార్డెన్ లో ఉన్నాయని ప్రిన్సిపాల్ జి సుకన్య, గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య తెలిపారు. వీటన్నిటిని ప్రత్యేకమైన గ్రీన్ నెట్ హౌస్ లలో సంరక్షిస్తున్నామని, వీటి సంరక్షణకు పూర్వవిద్యార్థులు, దాతల సహకారం అవసరమని పేర్కొన్నారు. అరుదైన మొక్కలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉన్నాయని, వీటిని విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకుంటున్నారని కాలేజీ బాటనీ విభాధిపతి నర్మద తెలిపారు.