నిర్మల్ జిల్లాలో పంటలపై వానల దెబ్బ ! ..భారీగా తగ్గనున్న దిగుబడులు

నిర్మల్ జిల్లాలో  పంటలపై వానల దెబ్బ ! ..భారీగా తగ్గనున్న దిగుబడులు
  •     వరితో పాటు పత్తి, సోయాలది అదే పరిస్థితి 
  •     350 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సన్నాహాలు
  •     ఈనెల చివరివారం నుంచి కొనుగోలు

నిర్మల్, వెలుగు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరితో పాటు పత్తి, సోయాబీన్ పంటల దిగుబడి లెక్కలు తలకిందులు కానున్నాయంటున్నారు. మొదట్లో అధికారులు సాగు లక్ష్యాన్ని ఖరారు చేసి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఈసారి ఖరీఫ్ లో భారీగా దిగుబడులు వస్తాయని ఆశించారు. అయితే వర్షాల కారణంగా చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక సర్వే తర్వాత వర్షాలు పడడంతో పంట నష్టంతో  దిగుబడులు తగ్గనున్నాయి.

 వ్యవసాయ అధికారుల లెక్క ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ లో 1,27,225 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీనికి అనుగుణంగా దిగుబడి లక్ష్యం 2,10,065 మెట్రిక్ టన్నులు లెక్క కట్టారు. భారీ వర్షాలతో దిగుబడులపై తీవ్రం ప్రభావం పడింది. అలాగే లక్ష ఎకరాల్లో పత్తి, మరో లక్ష ఎకరాల్లో సోయా, 60వేల ఎకరాలకు పైగా మొక్క జొన్న పంటలను సాగు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే వర్షాలతో జరిగిన నష్టం కారణంగా అన్ని పంటల దిగుబడులు తగ్గిపోనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 351 వరి కొనుగోలు కేంద్రాలు 

 నిర్మల్ జిల్లాలో మొత్తం 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దొడ్డు రకం, సన్న రకం ధాన్యానికి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ద్వారా 173, పీఏసీఎస్ ద్వారా 149, డీసీఎంఎస్ ద్వారా 24, జీసీసీ ద్వారా 5 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు మొత్తం నిర్ధారించిన ధాన్యానికి 52 లక్షల గన్ని బ్యాగులు అవసరం కానున్నాయి. ప్రస్తుతం 25 లక్షల గన్ని బ్యాగులు అందుబాటులో ఉండడంతో మిగతావి రప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

దిగుబడులు తగ్గుతాయి

జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంటలకు ఎక్కువ నష్టం జరిగింది. దీని కారణంగా దిగుబడులు కూడా తగ్గుతాయి. వరి తోపాటు సోయాబీన్, పత్తి దిగుబడులు తగ్గే చాన్స్ ఉంది. గత ఆగస్టు 27 వరకు పంటల పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నా, ఆ తర్వాత మారిన వాతావరణం, ఇష్టానుసారంగా కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీంతో దిగుబడులు భారీగా తగ్గుతాయి.
బ– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, నిర్మల్ 

 భారీగా పంట నష్టపోయాం

మూడు ఎకరాలలో వరి సాగు చేశా. దిగుబడి భారీగా వస్తుందని ఆశించా. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో ఆశలను వమ్ము చేసింది. ఇప్పటికే సగానికి పైగా పంట నష్టపోగా, మిగిలిన పంటను అగ్గి తెగులు అంటుకుంది. సాధారణంగా ఎకరానికి 25 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని ఆశించా. పరిస్థితి చూస్తే 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మాదాసు కిషోర్, లింగాపూర్, కడెం మండలం