
కరీంనగర్, వెలుగు: బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అహంకారంతో మాట్లాడుతున్నారని, రాష్ట్ర కేబినెట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఓ దళిత మంత్రిని బర్తరఫ్ చేయగా, మరో మంత్రిని చేయిపట్టి లాగారని విమర్శించారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి ఆదివారం కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘వచ్చే శనివారం సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నా తల్లిదండ్రులపై ప్రమాణం చేసి కేబినెట్‌లో జరిగిన ప్రతి అంశాన్ని చెబుతా.. తేదీ, టైం నేనే చెబుతున్నా.. నువ్వు వస్తావా ? లేక నువ్వే తేదీ, టైం చెబితే నేనే వస్తా’ అని సవాల్ విసిరారు. హరీశ్‌రావుకు నీతి, ధర్మం, న్యాయం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.
రాష్ట్ర కేబినెట్‌లో ప్రజా సంక్షేమం, విద్య, బీసీ రిజర్వేషన్లు, దళిత సంక్షేమం వంటి అంశాలపై లోతుగా చర్చించామని చెప్పారు. దళిత, బీసీ, బలహీనవర్గాల బిడ్డలు ఉన్న కేబినేట్‌ను ‘దండుపాళ్యం’ అంటావా అని మండిపడ్డారు. ముందు కవిత వ్యాఖ్యలపై, నేరెళ్ల ఘటనపై ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నీళ్లను సిద్దిపేటకు మళ్లించడం సరికాదన్నారు. హరీశ్‌రావు నోరు అదుపులో పెట్టుకోవాలని, తాను ప్రజాప్రతినిధిని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.