
- గోండ్ తెగ సంస్కృతికి, ఐక్యతకు ‘దండారి’ ప్రతీక
- నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ కూచడి శ్రీహరిరావు
సారంగాపూర్,వెలుగు: దండారి పండుగ ఆదివాసి గోండ్ తెగ ప్రజల సంప్రదాయ, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకని నిర్మల్ డీసీసీ ప్రెసిడెంట్ కూచాడి శ్రీహరి రావు పేర్కొన్నారు. ఆదివారం సారంగాపూర్ మండల కేంద్రంలోని పెండల్దారిలో నిర్వహించిన దండారి పండుగలో ఆయన పాల్గొనగా.. గ్రామస్తులు గుస్సాడీ వేషధారణలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా దీపావళిని పురస్కరించుకొని గోండ్ తెగ తమ సంప్రదాయ పండుగ దండారిని ఉత్సాహంగా, ఆనవాయితీగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
గుస్సాడీ వేషధారణతో యువకులు మరింత ఉత్సాహంగా పండుగను మార్చారన్నారు. అనంతరం నృత్యం చేస్తూ ప్రోత్సహించారు. కార్యక్రమంలో సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది, మండల నేతలు మధుకర్, దాసరి రమేష్, అడెల్లి ఆలయ ధర్మకర్త భోజన్న, పోతన్న, రాజేశ్వర్, ముత్యంరెడ్డి, పారపెల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
బజార్ హత్నూర్ లో ..
బజార్ హత్నూర్, వెలుగు : ఆదివాసీ గూడేల్లో దండారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బజార్ హత్నూర్ మండలం చింతల్ సాంగ్వి గ్రామానికి చెందిన ఆదివాసీలు దీపావళి సందర్భంగా సొనాల మండలంలోని పార్డీ బీ గ్రామ ఆదివాసీలను ఆదివారం మర్యాదలతో ఆహ్వానించారు. ఆరాధ్య దైవమైన ఏత్మానూర్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి , డప్పు వాయిద్యాలతో గుస్సాడీ నృత్యంతో సందడి చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పటేల్ భీమ్ రావు , దేవరీ భూమన్న , ఆదివాసీ యూత్ అధ్యక్షుడు సిడం సుభాష్ , గ్రామ పెద్దలు , గ్రామ పటేల్, ఆదివాసీలు పాల్గొన్నారు.
కాగజ్ నగర్ లో
కాగజ్ నగర్, వెలుగు : దండారి సంబురాలతో ఆదివాసీ పల్లెలు సందడిగా మారాయి. రెండు రోజుల కింద ప్రారంభమైన ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కాగ జ్ నగర్ మండలం మాలిని, ఊట్ పల్లిలో ఆదివారం ప్రత్యేక పూజలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ కోలాటం, గుస్సాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. యువకులు డప్పుల దరువులతో ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి దండారిగా వెళ్లి అతిథి మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందోత్సాహంగా చేసుకుంటూ దీపావళి పండుగ వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
ఎమ్మెల్యే ఇంట గుస్సాడీల సందడి
ఇంద్రవెల్లి,(ఉట్నూర్)వెలుగు: ఏజెన్సీలో దండారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఇంటా దీపావళి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శని, ఆదివారాల్లో కొనసాగిన దండారీ ఉత్సవాల్లో గుస్సాడీలు ఆడి పాడారు. రాజంపేట, టక్కుగూడ, కల్లూరు గూడ, దుర్గాపూర్ నుంచి దండారీలు వచ్చి ఎమ్మెల్యే ఆతిథ్యాన్ని స్వీకరించారు. చచ్చోయ్ ఆటను ఆడి పాడారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, గుస్సాడీల నృత్యాలను తిలకించారు. రెండు రోజుల పాటు ఎమ్మెల్యే ఇంట సందడి నెలకొంది.