
- సహకరించిన అల్లుడు, అక్క కొడుకు
- సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో దారుణం
గజ్వేల్/వర్గల్, వెలుగు: ఇరవై గుంటల భూమి కోసం ఓ మహిళ తన భర్త, పెద్దమ్మ కొడుకుతో కలిసి తల్లిని హత్య చేసి డెడ్‌బాడీని చెరువులో పడేసింది. అనంతరం తనపై అనుమానం కలగకుండా ఉండేందుకు.. తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు మహిళ డెడ్ బాడీ దొరకడం, పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో వెలుగుచూసింది. కేసుకు సంబంధించిన వివరాలను గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన మంకని బాలామణి (55)కి ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు లావణ్య ములుగు మండలం తునికి బొల్లారంలో ఉంటుండగా.. చిన్న కూతురు నవనీత తన భర్త మధుతో కలిసి తన తల్లి వద్దే ఉంటోంది.
బాలమణికి గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొంత భూమిని చిన్నకూతురు నవనీత పేరున రిజిస్ట్రేషన్ చేయగా, మరికొంత భూమిని అమ్మగా వచ్చిన డబ్బులు సైతం ఆమెకే ఇచ్చింది. మిగిలిన భూమిలో 20 గుంటలను పెద్దకూతురు లావణ్యకు ఇచ్చి మిగతా భూమిని నవనీతకే ఇస్తానని చెప్పింది. అయితే తన అక్క లావణ్యకు ఒక్క గుంట భూమి కూడా ఇచ్చేది లేదని నవనీత చెబుతుండడంతో తల్లీకూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మరో వైపు బాలమణి తన అక్క కొడుకు, తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన రాయని గౌరయ్యకు రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులను తిరిగి చెల్లించాలని అడుగుతుండడంతో వారిద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన తల్లి బతికి ఉంటే లావణ్యకు భూమి రాసిస్తుందని అనుమానించిన నవనీత తల్లిని హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. దీంతో తన పెద్దమ్మ కొడుకైన గౌరయ్యను పిలిపించుకొని హత్య విషయాన్ని చెప్పి, ఇందుకు సహకరిస్తే తన తల్లి దగ్గర తీసుకున్న రూ.3 లక్షల బాకీని మాఫీ చేస్తానని చెప్పడంతో గౌరయ్య ఒప్పుకున్నాడు. ఈ నెల 10న రాత్రి బాలమణి తన ఇంట్లో పడుకోగా.. నవనీత, ఆమె భర్త మధు, పెద్దమ్మ కొడుకు గౌరయ్య కలిసి ముక్కు, నోరు మూసి హత్య చేశారు.
బాలామణి చనిపోయిందని నిర్ధారించుకున్నాక డెడ్‌బాడీని ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఆటోలో తునికిబొల్లారంలోని అయ్యప్ప చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలమణి కాళ్ల కడియాలు తీసేందుకు ప్రయత్నించగా.. ఎడమ కాలు కడియం రాకపోవడంతో కాలును కట్ చేసి వాటిని తీసుకున్నారు. అనంతరం డెడ్‌బాడీని చెరువులో పడేసి ఇంటికి వెళ్లిపోయారు. తర్వాత తనపై అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నవనీత ఈ నెల 12న గౌరారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో శనివారం తునికి బొల్లారం అయ్యప్ప చెరువులో డెడ్‌బాడీ తేలడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చెరువు వద్దకు చేరుకొని డెడ్‌బాడీ బాలమణిదిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారించగా.. చిన్నకూతురు నవనీతే హత్య చేసి తన అక్క లావణ్యపై అనుమానం కలిగేలా డెడ్‌బాడీని తునికి బొల్లారం చెరువులో వేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నవనీత, మధు, గౌరయ్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో వారే చంపినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.