ఉనికి కోసమే రైతులపై బీఆర్ఎస్ కపట ప్రేమ..కేటీఆర్‌‌‌‌పై విప్ బీర్ల అయిలయ్య ఫైర్

ఉనికి కోసమే రైతులపై బీఆర్ఎస్ కపట ప్రేమ..కేటీఆర్‌‌‌‌పై విప్ బీర్ల అయిలయ్య ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్ పార్టీలో తన ఉనికిని కాపాడుకునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. బుధవారం నిర్మల్‌‌లో కేటీఆర్ నిర్వహించిన సభ ‘రైతు గర్జన’ కాదని, కేవలం అధికార దాహంతో ఏర్పాటు చేసిన సభ అని మండిపడ్డారు. గురువారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌‌ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం ఓ వైపు కేటీఆర్, మరో వైపు హరీశ్ రావు రోడ్లపైకి వచ్చి డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

 ఎల్‌‌నినో పరిస్థితులపై బీఆర్‌‌ఎస్ నేతలు నీచపు రాజకీయాలు చేస్తూ, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.