
- పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు..
- గులాబీ పెద్దల తీరు నచ్చక మరికొందరు గుడ్‌బై
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడం, పార్టీలోని పెద్దలు ఇష్టమున్నట్లు కామెంట్లు చేస్తుండటంతో మిగతా లీడర్లలో చాలా మంది తమ దారి తాము చూసుకుంటున్నారు. ప్రజాతీర్పునే తప్పుపట్టేలా గులాబీ పెద్దలు మాట్లాడుతున్నారని, దీని వల్ల జనంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో ‘కారు’ దిగకపోతే తమ పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు లీడర్లు కాంగ్రెస్‌లో జాయిన్ అవగా.. మరికొందరు అందులో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేందుకు చాన్స్ లేకపోతే ఆల్టర్నేట్గా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని తమ అనుచరులతో చెప్తూ తొవ్వ సాఫ్ చేసుకుంటున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోపాటు నిత్యం ఇతర పార్టీలను ట్రోల్ చేసే సోషల్ మీడియా ఇన్చార్జులు కూడా ఉన్నారు.
కాంగ్రెస్‌కు భారీగా క్యూ
బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్, పసునూరి దయాకర్, రంజిత్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి ఆ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. ఏప్రిల్ పదో తేదీ లోగా బీఆర్‌ఎస్‌కు ఇంకా భారీ షాకులు తగులుతాయని వారు చెప్తున్నారు. ఇక, కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి కొనసాగిన వలసల కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి.
కాదంటే బీజేపీలోకి
బీఆర్ఎస్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి వెనుకంజ వేసిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. వీరిలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు ఉన్నారు. బీబీ పాటిల్‌కు జహీరాబాద్ టికెట్, రాములు కొడుకు భరత్‌కు నాగర్‌కర్నూల్ టికెట్‌ను బీజేపీ ప్రకటించింది. ఇక.. బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్ బీజేపీలో చేరి.. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్ నుంచి ఎంపీ టికెట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు విఫల ప్రయత్నాలు చేసిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడిక బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో కీలకంగా ఉండి, ఎన్నోసార్లు టికెట్ ఆశించి భంగపడ్డ ఓ నాయకుడు కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, కంటోన్మెంట్బై పోల్‌లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.