ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగిస్తున్న ఉచ్చు!..గులాబీ లీడర్లలో గుబులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగిస్తున్న ఉచ్చు!..గులాబీ లీడర్లలో గుబులు
  •  ఇంకా ఎవరిని అరెస్టు చేస్తారో...?
  •  విచారణలో కీలక విషయాలు వెల్లడి  
  • ప్రణీత్ రావ్ తెల్వదంటున్న ఎర్రబెల్లి
  •  వరంగల్ లో ఇద్దరు సీఐలు అరెస్టు
  • వరంగల్,  సిరిసిల్లలో సర్వర్ల గుర్తింపు
  • వికారాబాద్ అడవిలో హార్డ్ డిస్క్ లు

హైదరాబాద్: ఫోన్ల ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించిన వారెవరో తేల్చేందుకు పోలీసులు వివిధ రూపాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు డీఎస్పీ ప్రణీత్ రావ్ ఇంటరాగేషన్ లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచిలోని హార్డ్‌డిస్కులను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్‌ అడవిలో పడేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడ్ని వికారాబాద్ తీసుకెళ్లి ధ్వసం చేసిన హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 

పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేసినప్పటికీ.. ఇంటెలిజెన్స్ విభాగంలో అనుభవం ఉండి, ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితోపాటు మరో ఇద్దరితో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ప్రస్తుతం బంజారాహిల్స్ ఠాణాలో విచారణ జరుగుతోంది. ఇదిలా  ఉండగా ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు సీఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వరంగల్ లో అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నారని అనుమానిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇవాళ ఉదయం హైదరాబాదుకు విచారణ నిమిత్తం తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు అధికారులూ  మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో పనిచేశారు. 

మరోవైపు ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. దీంతో ఎవరెవరిని అరెస్టు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.