మండలి ఐదుసార్లు వాయిదా.. సీఎం సారీ చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యుల నిరసన

మండలి ఐదుసార్లు వాయిదా.. సీఎం సారీ చెప్పాలంటూ బీఆర్ఎస్ సభ్యుల నిరసన
  •     బీఆర్ఎస్​కు నిరసన తెలిపే నైతిక అర్హత లేదు: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌ నిరసనలతో శాసనమండలి శుక్రవారం పలుమార్లు వాయిదాలు పడుతూ గందరగోళం నెలకొంది. శుక్రవారం ఉదయం 10గంటలకు కౌన్సిల్‌‌ చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ మండలి సభ్యుల పోడియం వద్ద నల్లకండువాలతో నిరసన చేపట్టారు. శాసనమండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన సారీ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. దీంతో చైర్మన్‌‌ సభను వాయిదా వేశారు. తిరిగి 10.30 గంటలకు సభ షురూ కాగా మళ్లీ బీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు భానుప్రకాశ్, మధుసూధనాచారి, తాత మధు, వాణీదేవీ, సత్యవతి రాథోడ్, కవిత, శంభీపూర్‌‌ రాజు, తక్కళ్లపల్లి రవీందర్‌‌రావు తదితరులు నినాదాలు చేస్తూ నిరసణ తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై మండలిలో ఎమ్మెల్సీ కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు.

చప్పట్లు కొడుతూ కవిత ఎంకరేజ్

మంత్రులు  జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌‌ సభ్యులు జీవన్‌‌రెడ్డి నిరసన ప్రదర్శనపై సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో చైర్మన్ మళ్లీ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి మండలి ప్రారంభం కాగా మళ్లీ బీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు నిరసనలు కొనసాగించారు. సీఎం క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కవిత చప్పట్లు కొడుతూ నినాదాలు కొనసాగించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపామని మండలి చైర్మన్ తెలిపారు. సభ్యులు కూర్చోవాలని చెప్పినా వారు వినక పోవడంతో చైర్మన్‌‌ మళ్లీ లంచ్‌‌ అవర్‌‌ ప్రకటించారు. ఇలా శుక్రవారం శానసమండలి ఐదుసార్లు వాయిదా పడింది.

అడ్డుకోవడం సభ్యత కాదు..

మండలి ప్రారంభమైన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సభా మర్యాద గురించి ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్‌‌ఎస్​కు లేదని అన్నారు. నిరసన ఏ ఫామ్ లో రావాలో ఆ ఫామ్ లో రావాలని సూచించారు. సభను అడ్డుకోవడం సరికాదని, సభ్యత కాదన్నారు. కమిటీలు ఎంది? అని మాట్లాడితే ఎట్లా అని ప్రశ్నించారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం బయట మాట్లాడారు.. ఆ లెక్కకు వస్తే బీఆర్ఎస్ కు ప్రొటెస్ట్ చేసే నైతిక అర్హత లేదు. మాజీ సీఎం తనకు పెగ్గులు పోసే వ్యక్తికి రాజ్యసభ మెంబర్ ఇచ్చి విలువలను మంట కల్పిండు.. సభా మర్యాదలు పోగొట్టిండు.. మీరు కాదా విలువలను మంట కలిపింది” అని జూపల్లి ఫైర్ అయ్యారు.