ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ప్రముఖ కవి,రచయిత అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం వరకు వినోబా నగర్ లోనే అందెశ్రీ మృతదేహం ఉంచనున్నారు. అనంతరం ఘట్కేసర్ లోని NFC నగర్ కు తరలించనున్నారు.నవంబర్ 11న ఉదయం అందే శ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి.
అందెశ్రీ నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ... ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
