ముంబై: భారత రాష్ట్ర సమితి మహారాష్ట్ర శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోంది. అక్టోబర్ 6న పుణెలో జరిగే కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో మహారాష్ట్రలో కారు పార్టీ విలీనం కావడం లాంఛనమేనని తెలుస్తోం ది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యం గా శరద్ పవార్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు మానిక్ రావ్ సహా పార్టీ నేతలు ఇవాళ ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలవనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 6వతేదీన పుణెలో జరిగే కార్యక్రమంలో పార్టీని విలీనం చేస్తారని మరాఠీ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే ఎన్సీపీతో బీఆ ర్ఎస్ నేతల మంతనాలు పూర్తి అయ్యాయని, చేరిక మాత్రమే మిగిలి ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం పై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేసింది. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకున్నారు. మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ఉండి భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో భారీ మీటింగులు పెట్టి ప్రజలనుఆకర్షించే ప్రయత్నం చేశారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. స్వయానా తన అన్నకొడుకు వంశీధర్ రావును పార్టీ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ గా నియమిం చారు. అంతా బాగుందనుకున్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అసలు కష్టాలు మొద లయ్యాయి.
ఆ తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర వైపు కన్నెత్తి చూడలేదు. ఆఫీసులు అద్దెలు కూడా కట్ట కపోవడంతో స్థానిక నేతలు ఆందోళన చెందారు. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించినా.. అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో వాళ్లు అసలు మా రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఉంచుతున్నారా? పీకుతున్నారా? క్లారిటీ ఇచ్చేస్తే మా దారి మేం చూసుకుంటామంటూ కేసీఆర్కు లేఖ రాశారు. తమ రాష్ట్రంలోని పార్టీ ఆఫీస్లకు అద్దెలు కట్టడం లేదని, కాల్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ మీడియా ఎదుటే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఆ తర్వాత స్తబ్ధంగా ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహారాష్ట్ర శాఖను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమ య్యారు. ఈ నెల 6న విలీన ప్రక్రియ ఉండబో తోందని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు బేరర్లంతా ఎన్సీ పీలో చేరుతారని మరాఠా మీడియాలో కథనాలు వచ్చాయి.