
- మెర్జ్ చేసేందుకు101 శాతం ప్రయత్నించారు
- దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్టు అంటూ నాపై ముద్రవేశారు
- కోవర్టులుంటే బయటకు పంపకుండా నాపై ఏడ్పులేంది?
- ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులతో బద్నాం చేస్తరా?
- నాకు నీతులు చెప్తున్నోళ్లు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి?
- కేసీఆర్‌కు కమిషన్ నోటీసులిస్తే వాళ్లెందుకు స్పందించలే?
- పోరాటాలు చేయకుండా.. ట్విట్టర్లో పోస్టులు పెడ్తే చాలా?
- ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేస్కునుడేంది?
- నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నరు
- నేను కాంగ్రెస్‌లో చేరుతాననే వార్తలు పూర్తిగా అబద్ధం
- నాకు నల్లికుట్ల రాజకీయాలు తెల్వదు.. నేను నోరు విప్పితే బాగుండదు
- కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్త.. వేరెవ్వరి నాయకత్వంలోనూ చేయను
- కేటీఆర్, హరీశ్ రావులే లక్ష్యంగా చిట్‌చాట్‌లో కామెంట్లు
హైదరాబాద్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి కుట్రలు చేస్తున్నారని.. ఇప్పటికే 101 శాతం ప్రయత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రతిపాదనను తాను వ్యతిరేకించానని చెప్పారు. ‘‘బీజేపీ కావాలనే నన్ను లిక్కర్ స్కామ్‌లో ఇరికించి జైలుకు పంపించింది. ఆ టైంలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చింది. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అవసరమైతే ఇంకొన్ని నెలలు జైల్లోనైనా ఉంటానని నా తండ్రి కేసీఆర్‌కు చెప్పాను.
పార్టీని బీజేపీలో కలిపేస్తే కార్యకర్తలను మోసం చేసినట్టవుతుందని వివరించాను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకించినందుకే నాపై కుట్రలు పన్నుతున్నరు’’ అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్ స్ట్రాంగ్‌గానే ఉన్నారని.. కానీ, పార్టీలోని కొందరు బీజేపీలో విలీనం చేసేలా డ్రైవ్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గురువారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు.
కేటీఆర్, హరీశ్ రావు పేర్లు ఎత్తకుండానే వారిని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్లు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని తాను వ్యతిరేకించినందుకే తనపై రేవంత్ రెడ్డి కోవర్టు అంటూ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి బద్నాం చేయాలని చూస్తున్నరు. ఇట్లాంటివి చేస్తే చూస్తూ ఊరుకోను. అసలే మంచిదానిని కాదు. పార్టీలో నాకు నీతులు చెబుతున్నోళ్లు.. ముందు వాళ్లు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి? కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇస్తే స్పందించారా? గ్రామాగ్రామాన పోరాటాలు చేయాల్సిందిపోయి.. ట్విట్టర్లో పోస్టులకే పరిమితమవుతరా?” అని నిలదీశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌కు నోటీసులు ఇప్పించిన రేవంత్ రెడ్డిపై పోరాడాలన్నారు. తనను తన తండ్రి కేసీఆర్ నుంచి విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
కోవర్టులను బయటకు పంపండి
మరి‘‘పార్టీలో కోవర్టులున్నారని అంటున్నరు.. అలా చెప్పే బదులు ఆ కోవర్టులను బయటకు పంపాల్సింది కదా?’’ అని కవిత ప్రశ్నించారు. ఇటీవల కవిత లేఖ, అనంతరం ఎయిర్‌పోర్టులో ఆమె చేసిన కామెంట్ల తర్వాత కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘బీఆర్ఎస్లో రేవంత్ కోవర్టులు ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో కోవర్టుల అంశంపై కవిత నిప్పులు చెరిగారు.
‘‘కోవర్టులున్నారంటూ నాపై పడి ఏడ్చుడేంది? ముందు ఆ కోవర్టులను బయటకు పంపి కేసీఆర్‌ను కాపాడుకోవాలి. పార్టీలోని కోవర్టుల వల్లే నేను నిజామాబాద్‌లో ఎంపీగా ఓడిపోయాను. దానిని కేసీఆర్ ముందే గుర్తించారు. పార్టీ ఎమ్మెల్యేలు సహకరించలేదని తేల్చారు. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నాకు ప్రొటోకాల్ ఉండాలని భావించిన కేసీఆర్.. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. అంతేగానీ.. నేను ఏ పదవీ అడగలేదు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేద్దామనుకున్న. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని మా డాడీ కేసీఆర్ చెప్పారు. ‘నన్ను ఏం చేయలేకే నీ మీద పడ్డారు’ అని ఆయన అన్నారు. రాజీనామా చేయవద్దని చెప్పారు. అందుకే చేయలేదు. నాకు కేసీఆర్ సపోర్ట్ ఉంది కాబట్టే పదవిలో కొనసాగుతున్న’’ అనిఆమె స్పష్టం చేశారు.
దూతలతో ఇష్టమొచ్చినట్లు రాయిస్తున్నరు
కేసీఆర్‌కు తాను లేఖలు రాశానని పార్టీలోని కొందరు గగ్గోలు పెడుతున్నారని కవిత అన్నారు. తాను తన తండ్రికి ఇంతకు ముందు కూడా వందల లేఖలు రాశానని తెలిపారు. ‘‘నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేందిరా బై నొప్పి? నేను ఎప్పుడు లేఖ రాసినా కేసీఆర్ చదివి చించేసేవారు. కానీ, ఇప్పుడు నా ఖర్మేంటోగానీ చించలేదు. అది నేను నా తండ్రికి రాసిన అంతర్గత లేఖ. కానీ, ఆ లేఖనూ లీక్ చేశారు.
లేఖను లీక్ చేసిందెవరో కనిపెట్టండని చెబితే అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. నా లేఖపై కొందరు లీకు వీరులు.. గ్రీకువీరుల్లాగా విమర్శలు చేస్తున్నరు. నేను నోరు విప్పితే బాగుండదు. నేను కేసీఆర్ లెక్కనే. నాకు కొంచెం తిక్క ఎక్కువ. నేను ఏదైనా సూటిగానే మాట్లాడ్త. వెన్నుపోటు రాజకీయాలు నాకు తెల్వదు. నేను చిచోర పనులు చేయను. స్ట్రెయిట్ రాజకీయాలు చేస్త. నా దగ్గరకు వచ్చిన దూతలు ఇష్టమొచ్చినట్టు రాయిస్తున్నారు. నేను అనని మాటలు అన్నట్టు రాయించారు. ఓ పత్రిక నామీద అసత్య కథనాలు రాసినా పార్టీ తరఫున ఎవరూ నాకు అనుకూలంగా స్పందించలేదు. పార్టీలోని కొందరు నేతలు నాకు వ్యతిరేకంగా డ్రైవ్ చేస్తున్నరు’’ అని ఆమె మండిపడ్డారు.
నన్ను బయటకు పంపే దమ్మెవరికీ లేదు
తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించే దమ్ము ఎవరికి ఉందని కవిత ప్రశ్నించారు. ‘‘ఇది నా పార్టీ. నాకూ హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే పనిచేస్త. ఇతరుల నాయకత్వంలో నేను పనిచేయను. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు ప్రొటోకాల్ ఉంటుంది. దానికి తగ్గట్టు గౌరవం ఇస్త. నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ తల వంచను.
కొత్త పార్టీ వంటివి నాకు ఎందుకు? ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలు’’ అని ఆమె అన్నారు. ‘‘ఇక్కడ డైరెక్ట్‌గా పోరాడకుండా బయటదేశాల్లో మీడియా సెల్ పెట్టుకున్నం.. దొంగ దెబ్బ తీస్తామంటున్నరు. ముందు ఇక్కడ గ్రౌండ్లో పోరాడాలి” అని తేల్చి చెప్పారు. ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటూ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయకుండా అమెరికాలో ఉత్సవాలు దేనికని ప్రశ్నించారు. ఇటీవల ఎల్కతుర్తి సభ అయిపోగానే కేసీఆర్‌ను మోస్తున్నట్టుగా కార్టూన్లు వేయించుకున్నారని, కేసీఆర్‌ను మోసేంత పెద్దోళ్లు అయ్యారా? అని ఆమె నిలదీశారు.
కేసీఆరే అందరినీ మోస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ‘‘బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ సక్సెస్ అయింది కేసీఆర్ వల్లేనే. ఆయనే నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి జనాన్ని సమీకరించారు” అని తెలిపారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడు.. అదానీ, రేవంత్ భాయీ..భాయీ అని నిరసనలు చేశారు. అవసరమా అది అప్పుడు? అసలు పోరాడాల్సింది తెలంగాణ తల్లి విగ్రహంపై కదా” అని కవిత మండిపడ్డారు.
కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమించిన..
తెలంగాణ ఉద్యమంలో తాను కడుపులో బిడ్డను పెట్టుకుని పోరాడానని కవిత గుర్తుచేశారు. తనను విమర్శిస్తున్న నాయకులు ఎలాంటి ఉద్యమాలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లు ఆస్పత్రి పెడితే.. దాని ప్రారంభోత్సవానికి వెళ్లిందెవరని ప్రశ్నించారు. తనకు నల్లికుట్ల రాజకీయాలు తెల్వదని ఆమె అన్నారు. ‘‘అసలు పార్టీ(టీఆర్ఎస్)ని ఏర్పాటు చేసినప్పుడు ఉన్న పార్టీ పెట్టుబడిదారులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నరు... రేవంత్ రెడ్డి దగ్గరే కదా వాళ్లు ఉన్నది” అని పేర్కొన్నారు. తాను జాగృతిని ఏర్పాటు చేసినప్పుడు ఉన్నోళ్లలో 98 శాతం మంది ఇప్పటికీ తనతోనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను అమెరికాకు వెళ్లడానికి 20 రోజుల ముందు నుంచే దాడులు చేయడం మొదలు పెట్టారని, ఎన్నెన్నో కుట్రలు చేశారని మండిపడ్డారు. అమెరికా వెళ్లొచ్చే లోపు అన్ని కుట్రలూ చేసేశారని అన్నారు. ‘‘నా తండ్రి కేసీఆర్‌కు నేను రాసిన లేఖను లీక్ చేసిన వాళ్లెవరో ముందు కనిపెట్టాలి?” అని ఆమె డిమాండ్ చేశారు.
నేను క్లారిటీగానే ఉన్న
తనకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని, పూర్తి క్లారిటీతో ఉన్నానని కవిత స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానన్న ప్రచారం పూర్తి అబద్ధమన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలను నేను ఎన్నడూ కలవలేదు. 2013లో ఒక్కసారి తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలను కలిశాను. ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో మా నాయకులను కలిపించాను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ. దాంట్లో నేనెందుకు చేరుత? అసలు రాహుల్ గాంధీ కరెక్ట్‌గా ఉంటే.. దేశానికి బీజేపీ దరిద్రం ఎందుకు పట్టేది?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక విభాగమే జాగృతి. నాడు తెలంగాణ ఉద్యమ ద్రోహులపై పోరాడేందుకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాం. అప్పుడు విస్తృతంగా పోరాడాం. ఆ తర్వాత పార్టీ కోసం జాగృతిని కొంచెం స్లో చేయాలని కేసీఆర్ చెప్పారు. దీంతో కొంత స్లో అయ్యాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిలాంటి ఉద్యమ ద్రోహులు ఉండడంతో మరోసారి పోరాడేందుకు జాగృతిని బలోపేతం చేస్తున్నం’’ అని ఆమె తెలిపారు. కాగా, ప్రజాభవన్‌లో రేవంత్ రెడ్డితో భేటీ తర్వాతే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును చేపట్టారని కవిత ఆరోపించారు.
బోనం ఎత్తి.. డ్యాన్స్ చేసి..
ఉదయం హైదరాబాద్‌లో తన ఇంట్లో చిట్‌చాట్ తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా సేవాలాల్ తండాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు.
నా తండ్రికి నేను లేఖ రాస్తే మీకేందిరా బై నొప్పి?
కేసీఆర్‌కు నేను రాసిన లేఖపై కొందరు లీకు వీరులు.. గ్రీకువీరుల్లా విమర్శలు చేస్తున్నరు. నా తండ్రికి నేను లేఖలు రాసుకుంటే మీకేందిరా బై నొప్పి? ముందు ఆ లేఖను లీక్ చేసిందెవరో తేల్చాలి. నేను నోరు విప్పితే బాగుండదు. నాకు వెన్నుపోటు రాజకీయాలు, నల్లికుట్ల రాజకీయాలు తెల్వదు. బీజేపీ వాళ్లు ఆస్పత్రి పెడితే.. దాని ప్రారంభోత్సవానికి వెళ్లిందెవరు? నేను సూటిగానే మాట్లాడ్త. స్ట్రెయిట్ రాజకీయాలే చేస్త.
ఇది నా పార్టీ.. నాకూ హక్కుంది
కోవర్టులున్నారంటూ నాపై పడి ఏడ్చుడేంది? ముందు ఆ కోవర్టులను బయటకు పంపండి. ఇది(బీఆర్ఎస్) నా పార్టీ. నాకూ హక్కు ఉంది. నా నాయకుడు కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే పనిచేస్త. ఇతరుల నాయకత్వంలో పనిచేయ. పార్టీ నుంచి నన్ను బయటకు పంపే దమ్మెవరికుంది? తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? ఎవరికీ తలవంచ. నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. పూర్తి క్లారిటీతో ఉన్నానని బీఆర్ఎస్ కవిత తెలిపారు.